
శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ప్రైవేట్ టీచర్లను ను కించపరుస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరం తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు గోపగాని లింగమూర్తి అన్నారు.శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలేనని అన్నారు.ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ ఉపాధ్యాయులలో ప్రేరణ కల్పించడం కోసం ముఖ్యమంత్రి చేసిన ప్రసంగంలో ఇంటర్ పాస్ అయిన వాళ్లు డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్లే ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారని అయినా ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులను గొప్ప జ్ఞానం కలవారని డాక్టరేట్ కలవారిని పొగుడుతూ ప్రైవేటు టీచర్లను చులకన చేసి మాట్లాడడం తీవ్రంగా ఖండించదగ్గ విషయం అన్నారు. మీరు ప్రభుత్వం ఉపాధ్యాయులను పొగడండి ఆకాశానికి ఎత్తండి మాకేం అభ్యంతరం లేదు కానీ ప్రైవేట్ ఉపాధ్యాయులను కించపరచడం సమంజసం కాదు అన్నారు. రాష్ట్రంలోని దాదాపు 12 వేల ప్రైవేట్ పాఠశాలల్లో మూడు లక్షల మందికి పైగా విద్యాబోధన చేస్తున్నారని మేము కూడా ఓటర్లమేనని తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగమని మరిచిపోవద్దని అన్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలో మేము చేసిన పోరాటం మర్చిపోవద్దని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు ప్రభుత్వ టీచర్లతో సహా దాదాపు 90 శాతం మంది ఉద్యోగుల పిల్లలకు మా ప్రైవేటు టీచర్లు బోధన చేస్తున్నారు మరి వారు ప్రైవేట్ పాఠశాలలకు ఎందుకు పంపిస్తున్నారో ఒకసారి ఆలోచించాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేస్తున్నారంటే అది మా ప్రైవేట్ టీచర్ల యొక్క కృషి అని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండటం వలన మేము వాటిని సాధించలేకపోతున్నాం కానీ టాలెంట్ లేక కాదు అని అన్నారు.