ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు విఫలం

Governments fail to create employmentకార్మిక చట్టాల నిర్వీర్యానికి కుట్రలు : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ- మిర్యాలగూడ
కార్మికులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం పెయింటింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. నేడు సమాజంలో అన్ని పనులనూ యంత్రాలతో చేయడం వల్ల కార్మికులకు పని దొరకడం లేదని తెలిపారు. కార్మికులకు ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పాలకులు పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని చెప్పారు. 8 గంటల పని విధానాన్ని 12 గంటలుగా మార్చి కార్మికుల శ్రమదోపిడీకి పాల్పడుతున్నారన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికుల కుటుంబాలు వీధినపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యం శ్రమపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్‌ కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నదని, పేదలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేసి హక్కులను కాలరాస్తోందన్నారు. కార్మిక చట్టాలు లేకుండా చేసేందుకు ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని చెప్పారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ రాజకీయ లబ్ది కోసం ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలను గుర్తించి అప్రమత్తతతో ఉండాలని కార్మికులకు సూచించారు. ప్రతి కార్మికునికీ విద్య వైద్యం ఉచితంగా అందించడంతో పాటు ఉపాధి కల్పించి, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పేదలు, కార్మికుల పక్షాన పోరాడే నాయకులను చట్టసభలకు పంపించాలని పిలుపునిచ్చారు. కార్మికులు ఐక్యంగా ఉండి వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేసి హక్కులను కాపాడుకోవాలన్నారు. కార్మికులకు సీఐటీయూ అండగా ఉంటుందన్నారు. అనంతరం కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్‌ మల్లు గౌతమ్‌రెడ్డి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బీఎంనాయుడు, సీపీఐ(ఎం) నాయకులు భావండ్ల పాండు, రాగిరెడ్డి మంగారెడ్డి, వరలక్ష్మి, యూనియన్‌ అధ్యక్షులు మందరాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love