విదేశాల్లో విద్యకు గ్రాడ్‌రైట్‌ సులభ మార్గం

విదేశాల్లో విద్యకు గ్రాడ్‌రైట్‌ సులభ మార్గం–  ఎనిమిది దేశాల యూనివర్శిటీలతో జట్టు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే వారికి గ్రాడ్‌రైట్‌ సులభ మార్గాలను సూచిస్తుందని ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు శశిధర్‌ సిస్టా, అమన్‌ సింగ్‌ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘షిప్టెడ్‌ 2023 కాన్‌క్లేవ్‌లో వారు మాట్లాడుతూ.. భారత్‌ నుంచి అమెరికా వెళ్లి విద్యను అభ్యసిస్తున్న వారిలో 30 శాతం మంది తెలుగు వారేనని తెలిపారు. విదేశాల్లో విద్యా వివరాలు, ప్రవేశాల కోసం దేశంలో అనేక కన్సల్టెన్సీలు పని చేస్తున్నాయని.. కానీ తమ ఎడ్‌-ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ వినూత్నంగా విద్యార్థికి కావాల్సిన పూర్తి సమాచారం అందిస్తుందన్నారు. ”విద్యార్థి ప్రస్తుతం చదువుతున్నదానికి ఏ దేశంలో, ఏ యూనివర్శిటీలో ఎలాంటి కోర్సుకు అర్హుడు. భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఎంత వేతనం పొందవచ్చనే వివరాలు అందుబాటులో ఉంటాయి. అదే విధంగా విదేశీ యూనివర్శిటీల్లో చదువుకు కావాల్సిన వ్యయాలకు రుణాలను అందించడానికి పలు విత్త సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. ఒకే వేదికపై యూనివర్శిటీ వివరాలు, కోర్సులు, విద్యా రుణం తదితర సేవలను అందిస్తున్నాం.”అని శశిధర్‌ సిస్టా తెలిపారు. ఎనిమిది దేశాల్లోని యూనివర్శిటీలతో భాగస్వామ్యం కలిగి ఉన్నామన్నారు. రాబోయే మూడేళ్లలో 3 లక్షల మంది భారతీయ విద్యార్థులకు ప్రపంచంలోని అగ్రశ్రేణి 500 విశ్వవిద్యాలయాల్లో సరసమైన ధరల్లో ప్రవేశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం తాము అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సింగపూర్‌ తదితర దేశాల్లోని యూనివర్శిటీల్లో ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో తాము తొలుత కార్యాలయం తెరిచామని.. మరో ఆఫీసును గూర్‌గావ్‌లో ఏర్పాటు చేస్తున్నామని… త్వరలోనే అమెరికాలోనూ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు.

Spread the love