రాత్రి సమయంలో ప్రమాదాలు..
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో యాసంగి సీజన్ వరి కోతలు ఊపందుకున్నాయి. అయితే.. వరి పొలాల్లో ధాన్యం అరబెట్టుకునేందుకు వసతులు లేక రైతులు ధాన్యాన్ని రోడ్లపై పోస్తున్నారు. రహదారులపై సగం వరకు ధాన్యంతో కప్పేయడంతో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. మండలంలో తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల, గాదంపల్లి, అడ్వాలపల్లి గ్రామాల్లోని రోడ్లపై రైతులు ధాన్యం అరబోస్తున్నారు. గతంలో మండల కేంద్రమైనా తాడిచెర్ల గ్రామానికి గుంటుక వేణు రోడ్డుపై పోసిన ధాన్యం కుప్పలకు ద్విచక్రవాహనం ఢీకొట్టి మృతిచెందారు. ఇదే కాకుండా కొందరికి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంఘటనలునున్నాయి. కల్లాలు లేకపోవడంతో రైతులు రోడ్లను ఆశ్రయిస్తుండగా వాహనదారులకు మాత్రం ప్రాణ సంకటంగా మారింది. రాత్రివేళల్లో వాహనదారులు జారిపడుతున్నారు.
రేడియం స్ట్రిక్కర్లు పెట్టాలి..
రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోస్తున్నప్పుడు కర్రలు ఏర్పాటు చేసుకొని వాటికి రేడియం స్టిక్కర్లను అతి కించుకోవాలని అధికారులతోపాటు పలువురు కోరుతున్నారు. దీంతో వాహనదారులు వాటిని గుర్తించి జాగ్రత్త పడతారు. ఒక్కో స్టిక్కరు ఖరీదు రూ.250 వరకు ఉంటుంది. రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేసుకోవాలని మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులకు పోలీసులు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే రోడ్లపై ధాన్యం పోయెద్దు. తప్పని సరిలో పోస్తే జాగ్రత్తలు తీసుకునే బాధ్యత సర్పంచ్లు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.



