563కు పెరిగిన గ్రూప్‌-1 పోస్టులు

563కు పెరిగిన గ్రూప్‌-1 పోస్టులు– 60 పోస్టులు అదనంగా మంజూరు
– త్వరలోనే అనుబంధ నోటిఫికేషన్‌
– ప్రిలిమ్స్‌ రద్దుకే టీఎస్‌పీఎస్సీ మొగ్గు
– సుప్రీంలో కేసు ఉపసంహరించుకునే అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో మరో 60 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి 2022, ఏప్రిల్‌ 26న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో గ్రూప్‌-1 పోస్టుల సంఖ్య 563కు పెరిగాయి. 60 గ్రూప్‌-1 పోస్టులను అదనంగా మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ప్రకటించారు. వీటిలో స్టేట్‌ ఆడిట్‌ శాఖలో అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ ఒక పోస్టు, డీఎస్పీ పోస్టులు 24, డిప్యూటీ సూపరింటెండెంట్‌ జైల్స్‌ పోస్టులు మూడు, జిల్లా ఉపాధి అధికారి పోస్టులు మూడు, ఎంపీడీవో పోస్టులు 19, జిల్లా పంచాయతీ అధికారి పోస్టులు రెండు, డిప్యూటీ కలెక్టర్ల పోస్టులు మూడు, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు నాలుగు, జిల్లా రిజిస్ట్రార్‌ (రిజిస్ట్రేషన్‌) పోస్టులు ఒకటి చొప్పున ఉన్నాయని వివరించారు. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గతేడాది జూన్‌ 11న టీఎస్‌పీఎస్సీ ప్రిలిమ్స్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అభ్యర్థులకు బయోమెట్రిక్‌ విధానాన్ని పాటించలేదంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రిలిమ్స్‌ను కోర్టు రద్దు చేసింది. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. అది ప్రస్తుతం విచారణలో ఉన్నది. కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతో ఉద్యోగాల భర్తీపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఈనెల ఒకటో తేదీన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్టు ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. అందులో భాగంగానే 60 గ్రూప్‌-1 పోస్టులను మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను రద్దు చేసేందుకే టీఎస్‌పీఎస్సీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టుకు నివేదించి కేసును ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. న్యాయనిపుణులు కూడా ఇదే విషయా న్ని ధ్రువీకరించినట్టు తెలిసింది. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసుకు సంబంధించి తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంలో నిరుద్యోగుల పాత్ర కీలకంగా ఉన్నది. అందుకే నిరుద్యోగులకు మేలు చేసే దిశగానే రాష్ట్ర ప్రభుత్వం సమాలోచన చేస్తున్నట్టు తెలిసింది. సుప్రీంలో కేసు ఉపసంహరించుకుని 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశమున్నది. ఇంకోవైపు గురువారం నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతు న్నాయి.
మొదటిరోజు గవర్నర్‌ ప్రసంగంలో గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి సంబంధించిన అంశం ఉండే అవకాశమున్నది. టీఎస్‌పీఎస్సీ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అనుబంధ నోటిఫికేషన్‌ను జారీ చేసినా గతంలోని అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలుస్తున్నది. కొత్త వారికి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు సమాచారం. మళ్లీ ప్రిలిమ్స్‌ రాతపరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ సమాలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఇంకోవైపు 503 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌తో జత చేయకుండా 60 పోస్టుల భర్తీకి కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న కోణంలోనూ టీఎస్‌పీఎస్సీ అధికారులు ఆలోచన చేస్తున్నారని సమాచారం.

Spread the love