గ్రూప్‌-2 మళ్లీ వాయిదా

Group-2 Postpone again– జనవరి 6,7 తేదీల్లో నిర్వహణ
– ఎన్నికల నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వచ్చేనెల రెండు, మూడు తేదీల్లో నిర్వ హించా ల్సిన గ్రూప్‌ -2 రాతపరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కార్యదర్శి అనితా రామచంద్రన్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేసిందని తెలిపారు. టీఎస్‌పీఎస్సీ పాలకమండలి దీనిపై కూలంకషంగా చర్చించి వచ్చేనెల రెండు, మూడు తేదీల్లో జరిగే గ్రూప్‌-2 రాతపరీక్షలను రీషెడ్యూల్‌ చేయాలని నిర్ణయించామని వివరించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అధికారులు, కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు ఎన్నికల విధుల్లో ఉంటారని స్పష్టం చేశారు. ఈ క్రమంలో గ్రూప్‌-2 రాతపరీక్షలను నిర్వహించడం కష్టమని కలెక్టర్లు నివేదించారని పేర్కొన్నారు. దీంతో వచ్చేనెల రెండు, మూడు తేదీల్లో జరగాల్సిన గ్రూప్‌-2 రాతపరీక్షలను వాయిదా వేస్తున్నామనీ, వచ్చే ఏడాది జనవరి ఆరు, ఏడు తేదీల్లో తిరిగి నిర్వహిస్తామని వివరించారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు 29,30 తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్‌-2 రాతపరీక్షలను టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడం, నవంబర్‌ 3న నోటిఫికేషన్‌, 30న పోలింగ్‌ ఉండంతో మరోసారి వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో 18 శాఖల్లో 783 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్‌ 29న గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇదే తరహాలో డీఎస్సీ రాతపరీక్షలు కూడా వాయిదా పడే అవకాశమున్నది. బుధవారం దానిపై స్పష్టత వస్తుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Spread the love