వికలాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

వికలాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి– వచ్చే నెల మూడున కలెక్టరేట్ల ముందు ధర్నాలు : ఎన్‌పీఆర్‌డీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆసరా పింఛన్లు పెంచుతామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన హామిని వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డి) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు వెంకట్‌ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పింఛన్లకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.300లను రూ.3000లకు పెంచాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం అడివయ్య డిమాండ్‌ చేశారు. వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల మూడున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్‌ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పెన్షన్లకు కేంద్ర ప్రభుత్వం వాటాగా 2011 నుంచి కేవలం రూ.300లే ఇస్తుందనీ వాటితో ఎలా బతకాలని ప్రశ్నించారు. నిత్యావసర సరకుల ధరలు గడిచిన 13ఏండ్ల కాలంలో 300 రేట్లు పెరిగాయని గుర్తు చేశారు. ధరల పెరుగుదల సూచికి అనుగుణంగా పెన్షన్లు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగుల పింఛన్‌ను రూ.ఆరు వేలు, వృద్ధులు, వితంతువులతో పాటు ఇతర పింఛన్లను రూ. 4000లకు పెంచుతామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోచ్చి ఏడు నెలలైనా వాటి ఊసే ఎత్తటం లేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయం కోసం 44,49,767 మంది ఆసరా లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారని గుర్తు చేశారు. సమావేశంలో రాష్ట్ర కోశాధికారి ఆర్‌ వెంకటేష్‌, ఉపాధ్యక్షలు రాజు, మధు బాబు, అరిఫా, కాశప్ప, స్వామి, సహాయ కార్యదర్శులు ఉపేందర్‌, దశరథ్‌,రాష్ట్ర కమిటీ సభ్యులు సూరపంగా ప్రకాష్‌, ఆశన్నగారి భుజంగా రెడ్డి, కోట్ల గౌతమ్‌, వీరబోయిన వెంకన్న, పి శశికళ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Spread the love