నిరుద్యోగులకిచ్చిన హామీలు అమలు చేయాలి

నిరుద్యోగులకిచ్చిన హామీలు అమలు చేయాలి– పింఛన్లను వెంటనే పెంచి ఇవ్వాలి
– ఆశావర్కర్లు, అంగన్‌వాడీలకు జీతాలేవి?
– విద్యను కొందరికే పరిమితం చేసేందుకు బీజేపీ కుట్ర : మాజీ మంత్రి హరీశ్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులు, ఫించన్‌ దారులు, ఆశావర్కర్లు, అంగన్‌ వాడీలను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ‘ గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 అభ్యర్థులు, నిరుద్యోగులు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చెర్మైన్‌ దగ్గరికి వెళ్లి సమస్యలు చెబితే అంతా ప్రభుత్వం చేతుల్లో ఉందని చెప్పారు. ప్రజా దర్బార్‌కు వెళ్లి అధికారుల కాళ్లమీద పడ్డా కనికరించడం లేదు. నిరుద్యోగులకు మాట ఇచ్చిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌ దగ్గరికి వెళ్లినా స్పందన లేదు…’ అని ఆయన విమర్శించారు. గ్రూప్‌ 1కు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్‌కు అవకాశం ఇవ్వాలనీ, .గ్రూప్‌ 2కు , గ్రూప్‌ 3కి 3 వేల ఉద్యోగాలు కలుపుతామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. పరీక్షకు పరీక్షకు మధ్య 2 నెలల గ్యాప్‌ ఉండేలా చూడాలని సూచించారు. వరస పరీక్షలతో అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారనీ, ఇప్పటికే సంగీత అనే అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్‌ క్యాలెండర్‌ ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. 25 వేల పోస్టులతో డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతామన్న కాంగ్రెస్‌ అంతకు ముందు ప్రతి నెలా ఇచ్చే పింఛన్‌ కూడా ఇవ్వడం లేదని హరీశ్‌ రావు విమర్శించారు. ఇంట్లో అర్హులుంటే ఇద్దరికి పింఛన్‌ హామీని కూడా విస్మరించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యమైంది ఇక్కడెందుకు కాదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే కాంగ్రెస్‌ సర్కార్‌ ఒక్కో పింఛన్‌ దారునికి రూ.12 వేలు బకాయి పడిందనీ, మొత్తం కలుపుకుని రూ.16 వేలివ్వాలని డిమాండ్‌ చేశారు. వికలాంగులకిచ్చిన హామీ మేరకు రూ.6 వేలు ఇవ్వాలని కోరారు. పెండింగ్‌ పింఛన్లు చెల్లించి కొత్త పింఛన్లను మంజూరు చేయాలని కోరారు. ఆశావర్కర్లు, ఎన్‌ హెచ్‌ఎం ఉద్యోగులు తమ జీతాల కోసం హైదరాబాద్‌ కు వచ్చి ధర్నాలు చేస్తున్నారని హరీశ్‌ రావు తెలిపారు. ప్రతి నెలా 18న జీతాలిస్తూ ఒకటో తేదీన ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నదని ఎద్దేవా చేశారు. గ్రామపంచాయతీ పారిశుధ్య వర్కర్లకు ఐదు నెలలుగా జీతాలు లేవనీ, అంగన్‌ వాడీ టీచర్లకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వలేదని చెప్పారు. కేసీఆర్‌ ఫోటో ఉందనే కారణంగా సీఎంఆర్‌ఎఫ్‌కు సంబంధించిన 65 వేల చెక్కులను నిలిపేశారని హరీశ్‌ రావు ఆవేదన వ్యక్తం చేశారు. వాటిపై సీఎం రేవంత్‌ రెడ్డి ఫోటో పెట్టి ఇవ్వాలని కోరారు. ఫోటో కారణంతో పేదలను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు.
కిషన్‌ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలి
నీట్‌లో తెలుగు విద్యార్థులకు అన్యాయం జరగకుండా కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజరు స్పందించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ పాలనలో సంపద ఇప్పటికే కొందరి చేతుల్లోకి వెళ్లిందనీ, ఇక విద్య కూడా కొందరి చేతుల్లోకే వెళ్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏండ్ల తరబడి నిద్రాహారాలు లేకుండా నీట్‌ కోసం చదివిన విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. గ్రేస్‌ మార్కులు, పేపర్‌ లీకేజీలు ఈ ఆందోళనకు కారణమన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 67 మందికి ఫస్ట్‌ ర్యాంకు ఎలా వస్తుంది? ఒకే సెంటర్లో రాసిన ఆరుగురికి 720 మార్కులెలా వచ్చాయి? అని ఆయన ప్రశ్నించారు. గ్రేస్‌ మార్కులు కలిపిన 1563 మంది పేర్లు, క్రైటీరియా బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. నీట్‌లో గ్రేస్‌ మార్కుల విధానమే లేనప్పుడు ఎలా కలిపారు? ఫలితాలను పది రోజులు ముందుకు జరిపి, పార్లమెంటు ఫలితాల రోజే ఎందుకు విడుదల చేశారు? ఈ ఆంశంపై లోతైన విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.
వ్యూస్‌ కోసం నిజాయితీని దెబ్బతీయొద్దు
సంచలనాల కోసం మీడియా,సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ ఛానల్‌ లో తనపై కాంగ్రెస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీశ్‌ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను అవుతాననీ, కాంగ్రెస్‌లోకి, బీజేపీలోకి వెళ్తున్నానని ఏవేవో చెబుతున్నారు, దయచేసి ఇలాంటి తంబ్‌నెయిల్స్‌ పెట్టకండి, మీ లైక్స్‌ కోసం, వ్యూస్‌ కోసం ఒక నాయకుడి నిబద్ధతను, నిజాయితీని దెబ్బతీయొద్దు … .’ అని కోరారు. ఇలాంటివి మానుకోకపోతే లీగల్‌ చర్యలు తీసుకోడానికి వెనుకాడబోమని హరీశ్‌ రావు హెచ్చరించారు.

Spread the love