అగ్రస్థానంలోనే గుకేశ్‌

అగ్రస్థానంలోనే గుకేశ్‌– ఫిడె క్యాండిడేట్స్‌ చెస్‌ 2024
టోరంటో (యుఎస్‌ఏ) : ప్రతిష్టాత్మక ఫిడె క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ డి. గుకేశ్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పది రౌండ్ల మ్యాచుల అనంతరం 6.0 పాయింట్లతో టాప్‌ పొజిషన్‌లో నిలిచాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఐయాన్‌ (రష్యా) సైతం 6.0 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. పదో రౌండ్‌లో గుకేశ్‌, ఐయాన్‌ మ్యాచ్‌ 40 ఎత్తుల్లో డ్రాగా ముగియగా.. భారత గ్రాండ్‌మాస్టర్లు ఆర్‌. ప్రజ్ఞానంద, విదిత్‌ గుజరాతీలు తమ మ్యాచ్‌ను 39 ఎత్తుల్లో డ్రా చేసుకున్నారు. నిజత్‌పై నకమురు 58 ఎత్తుల్లో విజయం సాధించగా.. అలిరెజాపై ఫాబియానో 47 ఎత్తుల్లో గెలుపొందాడు. ఆర్‌. ప్రజ్ఞానంద (5.5) మూడో స్థానంలో కొనసాగుతుండగా.. విదిత్‌ గుజరాతీ (5.0) ఆరో స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో ఆర్‌. వైశాలి వరుస నాలుగు ఓటములకు చెక్‌ పెట్టింది. పదో రౌండ్లో సాలిమోవ (బల్గేరియా)పై 88 ఎత్తుల్లో విజయం సాధించింది. కోనేరు హంపీ 72 ఎత్తులో టాన్‌ (చైనా)తో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. కోనేరు హంపీ (4.5) ఐదో స్థానంలో, ఆర్‌. వైశాలి (3.5) ఎనిమిదో స్థానాల్లో నిలిచారు.

Spread the love