గల్ఫ్‌ నకిలీ ఏజెంట్‌ ముఠా సభ్యుడి అరెస్ట్‌

– దేశవ్యాప్తంగా 500 నుంచి 600 మంది బాధితులు
– నకిలీ ఏజెంట్‌ సంస్థల మాటలతో మోసపోవద్దు
– రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నవి రెండే లైసెన్సుడ్‌ ఏజెంట్‌ సంస్థలు : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌
నవతెలంగాణ – సిరిసిల్ల
ఉపాధి ఆశలతో గల్ఫ్‌కు వెళ్లాలనుకునే వారిని మోసగించి తీసుకెళ్లి సైబర్‌ నేరాలు చేయిస్తున్న నకిలీ ఏజెంట్‌ ముఠా సభ్యున్ని సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 500 నుంచి 600 మంది బాధితులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అనధికార గల్ఫ్‌ ఏజెంట్‌ సంస్థలతో యువత భవిష్యత్‌ అంధకారం అవుతుందని జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. శనివారం జిల్లా పోలిస్‌ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ మాట్లాడుతూ.. జిల్లా పోలీస్‌ కార్యాలయానికి నాలుగు రోజుల కిందట సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూర్‌ గ్రామానికి చెందిన అతికం లక్ష్మీ వచ్చి.. తన కొడుకు అతికం శివప్రసాద్‌.. జగిత్యాల జిల్లా కోడిమ్యాల గ్రామానికి చెందిన కంచర్ల సాయి ప్రసాద్‌ అనే ఏజెంట్‌కి రూ.1.40 లక్షలు ఇచ్చినట్టు తెలిపిందన్నారు. అతను తన కుమారున్ని ఉపాధి కోసం కంబోడియా దేశానికి పంపించాడని, అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఈ విషయమై శివ ప్రసాద్‌ మొబైల్‌ నెంబర్‌ తీసుకొని వాట్సప్‌ ద్వారా విచారించగా, కాంబోడియాలో చైనీస్‌ కంపెనీలో శివ ప్రసాద్‌ పాస్‌పోర్ట్ట్‌ తీసుకొని సైబర్‌ నేరాలు చేయిస్తున్నారని, తనలాగే భారత్‌కు చెందిన సుమారు 500 నుంచి 600 మంది బాధితులు ఉన్నట్టు తెలిపినట్టు వివరించారు. వారందరితో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ఇండియన్‌ ఫోన్‌ నంబర్స్‌ ఇచ్చి లాటరీ ఫ్రాడ్స్‌, జాబ్‌ ఫ్రాడ్స్‌, టాస్క్‌లు ఇచ్చి.. అవి చేస్తే అధికమొత్తంలో డబ్బులు వస్తాయని సైబర్‌ మోసాలు చేయిస్తున్నారని తెలిపారు.బాధితురాలు అతికం లక్ష్మి పిర్యాదుపై, సిరిసిల్ల పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, కంబోడియాలో ఉన్న ఇండియన్‌ ఎంబసీ అధికారులతో మాట్లాడి బాధితుని వివరాలు పంపించామన్నారు. అక్కడి లోకల్‌ పోలీస్‌ల సహాయంతో రెస్క్యూ చేసి శివ ప్రసాద్‌ను రక్షించిందని ఎస్పీ తెలిపారు. శివ ప్రసాద్‌ రెండ్రోజుల్లో ఇండియాకు చేరుకుంటాడని, అతడిలాగే అక్కడ ఉన్న బాధితులని కాపాడి ఇండియాకు తీసుకొస్తామని తెలిపారు. దాంతోపాటు లక్ష్మి ఫిర్యాదుతో జగిత్యాల జిల్లాకు చెందిన కంచర్ల సాయి ప్రసాద్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని విచారించినట్టు చెప్పారు. తాను రూ.10వేలు కమీషన్‌ తీసుకొని లక్నోకు చెందిన సదాకత్‌ అనే వ్యక్తికి పంపినట్టు అతను విచారణలో తెలిపాడన్నారు. ప్రస్తుతం సదాకత్‌ మాల్దీవ్స్‌లో ఉంటున్నాడని, అతను కూడా రూ.10వేలు కమీషన్‌ తీసుకొని పూణేలో ఉన్న అబిద్‌ అన్సారీకి పంపుతాడని చెప్పారు. వీరు బీహార్‌ రాష్టానికి చెందిన ప్రస్తుతం దుబారులో ఉంటున్న షాదబ్‌కి పంపగా, శివను కంబోడియా దేశానికి పంపించినట్టు తెలిపారు. జగిత్యాల జిల్లాకు చెందిన కంచర్ల సాయి ప్రసాద్‌ను, పూణేలో ఉన్న అబిద్‌ అన్సారీని అదుపులోకి తీసుకున్నామని, మిగతా ఇద్దరిని త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.
అనుమానాలుంటే పోలిస్‌లను సంప్రదించండి.
ఉద్యోగ, ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశాలకు వెళ్ళుతున్న యువకులు లైసెన్స్‌ కలిగి ఉన్న ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలని ఎస్పీ సూచించారు. జిల్లాలో ఎవరైతే ఏజెన్సీలు, ఏజెంట్ల చేతిలో మోసపోయారో వారి కోసం ఏర్పాటు చేసిన స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ అధికారి ఫోన్‌ నెంబర్‌ 8712656411కు నేరుగా ఫోన్‌ కాల్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని చెప్పారు. విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి, సీఐ రఘుపతి, టాస్క్‌ఫోర్స్‌ సీఐ ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Spread the love