– అమెరికా సాయంతోనే అంతా
శాంటియాగో : చిలీ సోషలిస్టు నేత సాల్వడారో అలెండె నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అమెరికా కూలదోసి, సైనిక పాలన విధించి ఇప్పటికి అర్ధ శతాబ్దం గడిచింది. ఆనాటి సైనిక కుట్రకు, అలెండె హత్యకు అమెరికా మద్దతు వుందని వెల్లడిస్తూ కొద్ది రోజుల క్రితమే ఒక నివేదిక వెలువడింది. ఆనాటి కుట్రలో ఆచూకీ తెలియకుండా పోయిన వారికోసం గాలింపు జరిపేందుకు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక ప్రణాళికను అమలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అలెండె ప్రభుత్వాన్ని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు అమెరికా చాలా ప్రయత్నించింది. అందులో విజయం సాధించలేకపోయింది. 1973 సెప్టెంబరు 11న సైన్యం, జనరల్ అగస్టో పినొచెట్ సాయంతో ప్రభుత్వాన్ని కూలదోసింది. ఇక ఆ తర్వాత నుంచి 17ఏళ్ల పాటు పినొచెట్ నేతృత్వంలో అణచివేత పాలన సాగింది. అమెరికాతో పొత్తు పెట్టుకుంది. ఈ 17ఏళ్ల కాలంలో మూడు వేల మందికి పైగా గల్లంతయ్యారు. 38వేల మంది రాజకీయ ఖైదీలుగా మారారు. వారిలో చాలా మంది వేధింపుల బాధితులే. కుట్ర రోజున, అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ సిఐఎ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌కు పంపిన నివేదికను విడుదల చేశారు. ‘గత మూడేళ్లుగా అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి హెన్నీ కిస్సింగర్ ప్రోత్సహిస్తూ వచ్చిన సైనిక కుట్ర ఇప్పటికి జయప్రదంగా పూర్తయింది’ అని ఆ నివేదిక పేర్కొంది.