కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్‌ ఓకే

Hamas OKs Ceasefire Agreementఈజిప్టు, ఖతార్‌ మధ్యవర్తులుగా ముందుకు తెచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్‌ అంగీకరించినట్టు గ్రూప్‌ ప్రతినిధి సోమవారం అల్‌ జజీరాతో చెప్పారు. ఇజ్రాయెల్‌ దీర్ఘకాలంగా ప్లాన్‌ చేసిన దాడికి ముందు రఫా నగరాన్ని ఖాళీ చేయమని ఆదేశించిన కొద్దిసేపటికే ఈ ప్రకటన వచ్చింది. హమాస్‌ నాయకుడు ఇస్మాయిల్‌ హనియే ఖతార్‌ ప్రధాన మంత్రి షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ అల్‌ థానీ , ఈజిప్టు ఇంటెలిజెన్స్‌ మంత్రి అబ్బాస్‌ కమెల్‌తో ఫోన్లో చర్చించారు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి తమ ప్రతిపాదనకు హమాస్‌ ఉద్యమం ఆమోదం తెలిపిందని గ్రూప్‌ అల్‌ జజీరా కు ఒక ప్రకటనలో తెలిపింది ప్రతిపాదన వివరాలు ఇంకా బహిరంగపర్చలేదు. హమాస్‌ గతంలో ఏదైనా కాల్పుల విరమణ శాశ్వతంగా ఉండాలని , ముట్టడి చేసిన పాలస్తీనా ఎన్‌క్లేవ్‌ నుంచి ఇజ్రాయెల్‌ సైనికులందరినీ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఈ హామీలను ఇవ్వడానికి నిరాకరించారు. గత వారం ఇజ్రాయెల్‌ హమాస్‌ను గాజాలో అధికారంలో ఉండనివ్వదని , కాల్పుల విరమణ ఒప్పందం లేదా లేకుండా రఫాపై దాడి చేస్తుందని హెచ్చరించింది. అయితే, పాలస్తీనా ఖైదీల కోసం ఇజ్రాయెల్‌ బందీలను మార్చుకోవడానికి యుద్ధంలో తాత్కాలిక విరామాన్ని ప్రకటించటానికి ఇజ్రాయిల్‌ సిద్ధంగా ఉందని నెతన్యాహు చెప్పాడు. ప్రస్తుతం గాజాలోని ఇతర ప్రాంతాల నుంచి దాదాపు 14 లక్షలమంది స్థానభ్రంశం చెందిన పాలస్తీనియన్లు నివసిస్తున్న దక్షిణ గాజాలోని రఫా నగరం పై దండయాత్రను ప్రారంభించాలని ఇజ్రాయెల్‌ ప్రధాని చాలా నెలలుగా బెదిరిస్తున్నారు. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, అనేక ఇతర దేశాలు ఖండించినప్పటికీ, ఇజ్రాయెల్‌ సైన్యం సోమవారం నాడు పౌరులను రఫాను విడిచి వెళ్ళాలని ఆదేశించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ”విపరీతమైన శక్తి”తో నగరంపై దాడి జరుగుతుందని హెచ్చరించింది. కాల్పుల విరమణ ప్రతిపాదనను ఆమోదించాలనే హమాస్‌ నిర్ణయాన్ని దాడి ముప్పు ప్రభావితం చేసిందా అనేది స్పష్టంగా తెలియలేదు. నెతన్యాహు రఫాలోకి ప్రవేశించాలని పట్టుబట్టినప్పటికీ, ఇతర ఇజ్రాయెల్‌ అధికారులు ఇజ్రాయెల్‌ తాత్కాలిక సంధికి అంగీకరించడం ద్వారా హమాస్‌ దాడిని నివారించవచ్చని సూచించారు. ఈజిప్ట్‌ , ఖతార్‌ ముందుకు తెచ్చిన ఒప్పందానికి ఇజ్రాయెల్‌ మద్ద తు ఉందా లేదా అనేది కూడా అస్పష్టంగా ఉంది.

Spread the love