హనుమండ్ల ఝాన్సీ రెడ్డి లోకల్…

– పౌరసత్వంపై బీఆర్ఎస్ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి
– సేవ చేయడానికే అమెరికా వదలి రాజకీయాల్లోకి
– ప్రజలు అవకాశం ఇస్తే భవిష్యత్తుకు భరోసనిస్తా
– పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డి
నవతెలంగాణ పెద్దవంగర: తన పౌరసత్వంపై బీఆర్ఎస్ నాయకుల దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలని, హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి లోకల్ అని, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సాయి గార్డెన్ లో కాంగ్రెస్ మండల విస్తృత స్థాయి సమావేశాన్ని మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ఝాన్సీ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు ఆమె కాంగ్రెస్ శ్రేణులు ద్విచక్ర వాహన ర్యాలీ తో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, హమ్యా నాయక్ తో కలిసి మాట్లాడుతూ… ప్రజలకు మరింత సేవలు అందించడం కోసమే అమెరికా విలాసవంతమైన జీవితాన్ని వదిలి వచ్చానని చెప్పారు. తన స్థానికత గురించి స్థానికేతరులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సుదీర్ఘకాలంగా పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. రాజకీయాల్లోకి రాకముందే కోట్లాది రూపాయలతో నిరుపేద ప్రజలకు సేవలందించాను. ఆశీర్వదిస్తే పాలకుర్తి ప్రజల కష్టసుఖాల్లో తోడుంటానని పేర్కొన్నారు. ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే.. భవిష్యత్తుకు భరోసా కల్పిస్తానని చెప్పారు. మంత్రి ఎర్రబెల్లిని పాలకుర్తి నుండి సాగనంపినప్పుడే నియోజకవర్గ ప్రజలకు విముక్తి కలుగుతుందన్నారు. గులాబీ కార్యకర్తలకే కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి పదేళ్లు కావస్తున్న నేటికి గ్రామాలు విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం కోసం ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తలంపుతో సోనియా ప్రత్యేక రాష్ట్రాన్ని చేస్తే, కేసీఆర్ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
ఎర్రబెల్లి మాయమాటలను ప్రజలు నమ్మరు.
ఎర్రబెల్లి మాయమాటలను ప్రజలు నమ్మరని ఝాన్సీ రెడ్డి చెప్పారు. దయాకర్ రావు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఆయన పాలనలో నియోజకవర్గంలోని సీసీ రోడ్ల పనులు జరిగాయి తప్పా, విద్య వైద్య రంగాల్లో గ్రామాలు ఆమడ దూరంలో ఉన్నాయని చెప్పారు. దేశం మొత్తం రాహుల్ గాంధీ నాయకత్వం కోసం ఎదురు చూస్తుందని, రాష్ట్రంలో సైతం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలనను అంతమొందించడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాబోయే రోజుల్లో సమన్వయంతో పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను పదేళ్లుగా అధికార పార్టీ నాయకులు వేదింపులకు గురి చేస్తూనే ఉన్నారని, ఇక వారి ఆటలు సాగవని హెచ్చరించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, వారి కష్టసుఖాల్లో అండగా ఉంటానని కార్యకర్తలకు భరోసా కల్పించారు. పార్టీ అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతస్థాయిలో ప్రచారం చేపట్టాలని కార్యకర్తలను కోరారు. మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్..కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు బీసు హరికృష్ణ మాట్లాడుతూ.. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ దేనని ఝాన్సీ రెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు అహర్నిశలుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు, ఉపాధ్యక్షుడు రంగు మురళీ, రెడ్డికుంట తండా సర్పంచ్ బానోత్ జగ్గా నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఉష, మండల మహిళా అధ్యక్షురాలు చిలుక దేవేంద్ర, లావణ్య, దాసరి శ్రీనివాస్, బానోత్ సీతారాం నాయక్, ఈదురు సైదులు, దుంపల కుమారస్వామి, యూత్ నాయకులు కనుకుంట్ల నరేష్, పన్నీరు వేణు, ఆవుల మహేష్, అనపురం వినోద్, ఎరుకల సమ్మయ్య, గద్దల ఉప్పలయ్య, రంగు అశోక్, సాంబ, రాంచరణ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love