కష్టపడి పని చేస్తేనే ప్రాధాన్యత

– కాంగ్రెస్ లోకి రావడానికి ద్వారాలు తెరిచేవున్నయి

– చేరేవారికి ఎవ్వరికీ టికెట్ల హామీ లేదు, సర్వెలే ప్రామాణికం
– టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
నవతెలంగాణ- కంటేశ్వర్
కష్టపడి పనిచేస్తేనే ప్రాధాన్యత ఉంటుందని కాంగ్రెస్ లోకి రావడానికి ద్వారాలు తెరిచి ఉన్నాయని చేరేవారికి ఎవరికి టికెట్ల హామీ లేదని సర్వేలే ప్రామాణికమని టిపిసిసి కార్యనిర్వాక అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం నిజామాబాద్ నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి  అధ్యక్షతన నూతనంగా నియమింపబడిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్  పాల్గొనడం జరిగింది.వారితోపాటు టీపీసీసీ ఉపాధ్యక్షులు తాహెర్బీన్ హందాన్ గారు, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ , నిజామాబాద్ రూరల్ ఇంచార్జ్ భూపతి రెడ్డి , బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ కాసుల బాల్ రాజు  పాల్గొన్నారు.నూతనంగా మండల బ్లాక్ స్థాయి అధ్యక్షులకు నియామక పత్రాలు అందించిన అనంతరం మహేష్ కుమార్ గౌడ్  మాట్లాడుతూ మండల స్థాయి మరియు బ్లాక్ స్థాయి నాయకులు మరియు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకలాంటివారని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని రానున్న మూడు నెలల సమయం కాంగ్రెస్ పార్టీకి చాలా క్రియాశీలక సమయమని ఈ సమయంలోనే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నుండి జిల్లా స్థాయి నాయకుని వరకు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నిబద్ధతతో కష్టపడి పనిచేయాలని, కష్టపడి పనిచేసిన వారికి భవిష్యత్తులో పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాష్ట్రంలోని బిఆర్ఎస్ అటు కేంద్రంలోని బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను అనునిత్యం ప్రజల్లోనికి తీసుకువెళ్లి గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేస్తూ భవిష్యత్తులో రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే చేపట్టబోయే అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల గురించి చెబుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేసే విధంగా కార్యచరణ రూపొందించాలని ఆయన నాయకులను కోరారు. మండల బ్లాక్ మరియు జిల్లాస్థాయి నాయకులు కచ్చితంగా రాబోయే కాలంలో కష్టపడి క్రమశిక్షణతో నిబద్దలతో పని చేయాలని వారి పనితీరును రాష్ట్రస్థాయిలో పిసిసి పర్యవేక్షిస్తుందని పనితీరు సరిగా లేని వారిపై వేటు తప్పదని ఆయన హెచ్చరిస్తూ నియోజకవర్గాల స్థాయిలో కార్యకర్తలు అభ్యర్థి గురించి ఆలోచించకుండా కేవలం పార్టీని బలోపేతం చేయడానికి మాత్రమే కృషి చేయాలని అభ్యర్థుల టికెట్ల విషయం పూర్తిగా అధిష్టాన నిర్ణయమని కాంగ్రెస్ పార్టీలో ముందుగానే టికెట్లు ప్రకటించే ఆనవాయితీ లేదని అధిష్టాన నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందేనని ఆయన స్పష్టం చేస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు ఉండాల్సిన ఒకే లక్ష్యం కేవలం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమేనని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు కిసాన్ కేత్ కాంగ్రెస్ ముప గంగారెడ్డి,మాజీ బీసీ సెల్ చైర్మన్ శేఖర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ విక్కీ యాదవ్, ఎన్.ఎస్.యు.ఐ వేణు రాజ్,మహిళా కాంగ్రెస్ భాగ్య, మైనారిటీ సెల్ ఇర్ఫాన్ అలీ, ఓబీసీ సెల్ నరేందర్ గౌడ్, ఎస్సీ సెల్ లింగం, సేవాదళ్ సంతోష్, వివిధ మండలాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అబ్దుల్ ఏజజ్, ఈసా, ప్రీతాం, నాగరాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love