హరీషే అబద్ధాలు చెబుతున్నారు

Harishe is lying– ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రతి విమర్శ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
సాగునీటి ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించే విషయంలో మాజీ ఇరిగేషన్‌ మినిస్టర్‌ హరీష్‌రావు అబద్దాలు చెబుతున్నారని రాష్ట్ర సాగునీటి పారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కన్నా తెలంగాణ ఏర్పడ్డాకే కష్ణానీటి వాటాకు సంబంధించి తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పరిపాలనా అసమర్థత వల్లనే కష్ణాజలాల్లో రైతులకు వాటా దక్కలేదన్నారు.
నీటి వాటాల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలపై మాజీ మంత్రి హరీష్‌రావు ప్రతివిమర్శలు చేసిన నేపథ్యంలో మంత్రి ఉత్తమ్‌ స్పందించారు. సోమవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ ఏ ప్రతిపదిక తీసుకున్నా బీఆర్‌ఎస్‌ సర్కారు, కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు తప్పేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆన్‌రికార్డ్స్‌లో కెేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడానికి ఒప్పుకుని నిర్వహణ కింద రూ. 200 కోట్లు కేటాయిస్తున్నట్టుగా పేర్కొన్నారని గుర్తుచేశారు. కష్ణా నది యాజమాన్య బోర్డుకు ప్రాజెక్ట్‌ ఇవ్వడానికి ఈ 56 రోజుల పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కడా ఒప్పుకోలేదని స్పష్టం చేశారు.
ఐదు, మే 2020న ఏపీ సర్కారు జీవో నెంబర్‌ 203 ద్వారా రోజుకు 8 టీఎంసీల నీటిని తీసుకుపోయేలా సహకరించారని అన్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌కు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులను పిలిస్తే కేసీఆర్‌ వెళ్లలేదని వివరించారు. ఏపీ రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కట్టుకోవటానికి అగ్రిమెంట్‌ మీద సంతకాలు పెట్టడానికే ఆ మీటింగ్‌కు కేసీఆర్‌ డుమ్మా కొట్టారని అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్న ఒక్క ప్రాజెక్ట్‌ కూడా 10 ఏండ్లల్లో పూర్తి చేయలేకపోయారని విమర్శించారు.
తెలంగాణకు నీటి కేటాయింపుల్లో మోసం చేశారన్నారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్ట్‌లు అప్పగించింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని అన్నారు. గ్రావిటీ ద్వారా రావలసిన ఎనిమిది టీఎంసీల కష్ణా జలాల నీటిని కేసీఆర్‌, జగన్‌ ఏకాంతంగా మాట్లాడుకుని ఏపీకి తరలించుకుపోవడానికి కుట్ర చేశారని ఆరోపించారు. మేము ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రాజెక్ట్‌లు ఇవ్వడానికి ఒప్పుకునేది లేదని అన్నారు. కేంద్ర మంత్రి షెకావత్‌ని కలిసి కూడా ప్రాజెక్ట్‌లు అప్పగించేది లేదని ఖరాఖండీగా చెప్పినట్టు గుర్తు చేశారు. తెలంగాణ వచ్చింది వీళ్ళ వల్ల కాదు, చిదంబరం కేంద్రంలో ఆల్‌ పార్టీ మీటింగ్‌ పెట్టి ఒప్పించడం వల్లేనని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ తెలంగాణలో ఓట్లను ప్రభావితం చేయడానికి ఓటింగ్‌ రోజున జగన్‌తో మాట్లాడుకుని పోలీసులను నాగార్జునసాగర్‌ డ్యామ్‌ మీదకు పంపి కుట్ర చేశారని తెలిపారు. రాజకీయంగా లబ్ధి పొందడానికే కేసీఆర్‌ ఈ నాటకం ఆడారని వ్యాఖ్యానించారు.

Spread the love