వన్యప్రాణులను వేటాడితే.. చంపితే కఠిన చర్యలు

వన్యప్రాణులను వేటాడితే.. చంపితే కఠిన చర్యలు– పీసీసీఎఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ చీఫ్‌ పర్గెయిన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వన్యప్రాణులను వేటాడినా, చంపినా కఠిన చర్యలు తీసుకుంటామనీ, చట్టపరంగా శిక్షలుంటాయని పీసీసీఎఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ చీఫ్‌ ఎమ్‌సీ పర్గెయిన్‌ హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని మహావీర్‌ హరిణవనస్థలి జాతీయ పార్కులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేటగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న వేట సామాగ్రిని ప్రదర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన్యప్రాణులను చంపడం, వేటాడే ప్రయత్నాలను నివారించడానికి 2023 డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్యాచ్‌ ది ట్రాప్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆరు నెలల కాలంలో 3,810 వలలు, ఉచ్చులను స్వాధీనం చేసుకున్నామన్నారు. అడవుల్లో వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగలకు తగిలి ఏడాది కాలంలో ఆరుగురు చనిపోయారని చెప్పారు. వేటగాళ్లు అమర్చిన వైర్లతో విద్యుద్ఘాతానికి గురై చనిపోయిన 57 వన్యప్రాణాలను గుర్తించామనీ, లెక్కలోకి రానివి ఇంకా ఎన్నో ఉంటాయని చెప్పారు. తమ డ్రైవ్‌ ప్రారంభించిన తర్వాత 6 నెలల కాలంలో మూడు విద్యుద్ఘాత కేసులే నమోదయ్యాయని వివరించారు. డ్రైవ్‌ గణనీయమైన ఫలితాలను సాధించిందనీ, అందులో అటవీ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మరువలేనిదని కొనియాడారు. ఈ డ్రైవ్‌ కింద ఫారెస్ట్‌ సిబ్బంది సాధ్యమైన ప్రాంతాలను చుట్టుముట్టాలనీ, వేటకు సంబంధించి రికార్డుల్లో ఉన్న వ్యక్తులను, అనుమానితులను విచారించాలనీ, వేట కోసం వారు ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకోవాలని కోరారు. వ్యవసాయ క్షేత్రాలు, అడవికి ఆనుకుని ఉన్న ప్రాంతాలను మరింత స్క్రీనింగ్‌ ద్వారా వలలు, ఉచ్చులు, పంజరాలు మొదలైన అన్ని రకాల పదార్థాలు, పరికరాలను స్వాధీనం చేసుకునేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టామన్నారు.

Spread the love