హస్తం గూటికి మల్లారెడ్డి..?

– కర్నాటక ముఖ్యనేతతో రాయబారం
– ఇప్పటికే అధిష్టానంతో చర్చలు
– అన్నీ కుదిరితే 9న ముఖ్యమంత్రి సమక్షంలో చేరిక
నవతెలంగాణ-బోడుప్పల్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నేత మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హస్తం గూటికి చేరడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈనెల 9న మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కండ్లకోయలో ముఖ్యమంత్రి పర్యటనలో మల్లారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్‌ ప్రమాదంలో పడింది. ఆయనకు మెడికల్‌ కాలేజీలు, ఇంజినీరింగ్‌ కాలేజీలతోపాటు ఇతర వ్యాపారాలు, ఆస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని కాపాడుకోవడం మల్లారెడ్డికి సవాల్‌గా మారినట్టు తెలుస్తోంది. రాజకీయంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అధికార పార్టీలోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఉన్న రాజకీయ వైరం, గతంలో రేవంత్‌ రెడ్డిపై ఘాటైన పదజాలంతో వ్యాఖ్యలు చేయడంతో మల్లారెడ్డిని కాంగ్రెస్‌లోకి రానిచ్చేది లేదని తేటతెల్లం కావడంతో కర్నాటక రాష్ట్రానికి చెందిన, జాతీయ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉండే కీలక నేతతో రాయబారం నడిపినట్టు మల్లారెడ్డే స్వయంగా నియోజకవర్గంలోని తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం.
ఆస్తులు కాపాడుకోవాలంటే మారక తప్పదు..!
గతంలో ఎంపీగా, మంత్రిగా మల్లారెడ్డి మేడ్చల్‌ జిల్లాను తన గుప్పిట్లో పెట్టుకొని భూములను కారు చౌకగా తన పేరిట, అనుచరుల పేరిట కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే.. మూడుచింతలపల్లి పరిధిలో గిరిజనుల భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారనే ఫిర్యాదుతో మల్లారెడ్డి, ఆయన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అదే విధంగా గుండ్లపోచంపల్లి పరిధిలో తన కాలేజీ కోసం హెచ్‌ఎండీఏకు చెందిన 12 గుంటల భూమిని కబ్జా చేసి రోడ్డు వేయించుకున్నారని ఫిర్యాదు రావడంతో రెండ్రోజుల కిందట జిల్లా కలెక్టర్‌ అదేశాల మేరకు మున్సిపల్‌ అధికారులు దాన్ని తవ్వేశారు. ఇలానే ఉంటే కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడటం ఖాయమని భావించిన మల్లారెడ్డి.. ఆస్తులు కాపాడుకోవాలంటే పార్టీ మారక తప్పదని సన్నిహితుల వద్ద వెల్లడించినట్టు సమాచారం. మొదట కాంగ్రెస్‌ పార్టీకంటే బీజేపీ మేలని భావించి.. ఆ పార్టీలో చేరేందుకు అనేక ప్రయత్నాలు చేసినట్టు వార్తలు వచ్చాయి. మల్కాజిగిరి ఎంపీ సీటు ఆశించారనీ తెలిసింది. అయితే ఇక్కడ బీజేపీ సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌కు ఎంపీ సీటు కేటాయించడంతో ఆ ప్రయత్నాలు మల్లారెడ్డి విరమించుకున్నట్టు సమాచారం.
మల్లారెడ్డి రాకను స్వాగతించేనా ?
మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వస్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని మల్లారెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారని, కాంగ్రెస్‌ కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులు పెట్టారని.. అలాంటిది ఇప్పుడు తన స్వలాభం కోసం కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తే తాము సహించేది లేదని కార్యకర్తలు కుండబద్దలు కొడుతున్నారు. అంతేకాకుండా మల్లారెడ్డి వైఖరి నచ్చకనే గత ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మొన్నటి ఎన్నికలలో మల్లారెడ్డికి ముచ్చెమటలు పట్టించిన కాంగ్రెస్‌ మేడ్చల్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్‌ యాదవ్‌, సీనియర్‌ నాయకుడు నక్క ప్రభాకర్‌గౌడ్‌ మల్లారెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఇవన్నీ ఇలా ఉంటే, మల్లారెడ్డిలాంటి ధనవంతుడు పార్టీలోకి వస్తే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ సీటు సులభంగా గెలవచ్చనే అభిప్రాయం కాంగ్రెస్‌ అధిష్టానం మదిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా మల్లారెడ్డి కారుకు హ్యాండివ్వడం ఖాయమనే గుసగుసలు నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా వినిపిస్తున్నాయి.

పార్టీ మారేది లేదు
నేను బీఆర్‌ఎస్‌ను వీడి ఏ పార్టీలోకి వెల్లనని మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై ‘నవతెలంగాణ’ మల్లారెడ్డిని ఫోన్‌లో సంప్రదించగా తాను ఏ పార్టీలోకి వెళ్లనని, తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని చెప్పారు.

Spread the love