అడ్డదారిలో వెళ్ళి అడ్డంగా ఇరుక్కున్నాడు

He got stuck in a crossroad– చెక్పోస్టులు తప్పించబోయి అడ్డుదారిలో ఇరుక్కుపడ్డ లారీ

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రం మీదుగా పెద్ద తడగూర్ రోడ్డు గుండా అడ్డుదారిగా వెళ్లాలని చూసిన లారీ డ్రైవర్ అడ్డదారిలో ఇరుక్కు పడ్డారు. ఇటు తెలంగాణ రాష్ట్రానికి, అటు మహారాష్ట్ర రాష్ట్రానికి ఇరు రాష్ట్రాల బార్డర్లో అంతర్రాష్ట్ర ఆర్టీవో చెక్పోస్టులు ఉన్నాయి. ఈ చెక్ పోస్టుల గుండా వెళ్తే ఓవర్ లోడ్ ఉన్న సరుకులకు రుసుము కట్టవలసి ఉంటుందని, ఈ మధ్యకాలంలో ఈ రెండు చెక్పోస్టులు తప్పించేందుకు మద్నూర్ మండల కేంద్రం మీదుగా పెద్దతడుగూరు రోడ్డు గుండా అక్రమ రవాణా రాత్రింబవళ్లు తేడా లేకుండా సరుకు లారీలు మహారాష్ట్ర నుండి తెలంగాణలోకి ఇటు నుండి మహారాష్ట్రలోకి ఓవర్ లోడ్ లారీలు జీరో దందాలతో తరలిస్తున్నారు. ఈ రెండు చెక్పోస్టుల్లో ఓవర్ లోడ్ రుసుము వసూల్ కాకుండా ప్రతి చెక్ పోస్ట్ వద్ద అధికారులు ప్రతి వాహనానికి రూ.400 రూపాయల చొప్పున అక్రమ వసూళ్లు చేస్తున్నారని, వాటిని దృష్టిలో పెట్టుకొని లారీ డ్రైవర్లు అడ్డుదారుల గుండా వెళ్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రహదారులు మెత్తబడ్డాయి. పల్లెటూరులకు సింగల్ రోడ్డు అలాంటి దారి గుండా వెళ్లాలంటే భారీ లోడు లారీలు ఇబ్బందికరమే. ఒక రైతు తమ పంటను కోసి వర్షం కారణంగా రోడ్డుపైన పెట్టుకున్నారు. ఆ పంట పక్కనుండి వెళ్లాలని ప్రయత్నంలో లారీ డ్రైవర్ అజాగ్రత్త మూలంగా రోడ్డు పక్కన మార్బుల్ లారీ ఇరుక్కు పడ్డది. ఇటు లారీ అటు పంట కుప్ప రహదారికి పూర్తిగా అడ్డు కావడంతో మద్నూర్ మండలంలోని చిన్నతడుగూరు ఖరగ్ గ్రామ ప్రజలకు, అదే విధంగా ఇతర వాహనాలకు వెళ్లలేని పరిస్థితి. ఇంత జరిగినా.. అడ్డదారులను అదుపు చేసే వారే లేకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు ఆదాయం కోల్పోవలసి వస్తుంది. ఒకటి కాదు రెండు కాదు రాత్రింబవళ్లు లెక్కిస్తే వందల సంఖ్యలు లారీలు ఈ అడ్డుదారి అక్రమ రవాణా కొనసాగుతుంది. దీనికి నిదర్శనం దారిలో ఇరుక్కుపడ్డ అక్రమ రవాణా సరుకులారే. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అడ్డ అక్రమ దారిని అదుపు చేసి ప్రత్యేకంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తే రోజుకు లక్షల రూపాయలు ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయి. సంబంధిత శాఖల అధికారులు ఈ అడ్డుదారికి ప్రత్యేక దృష్టి పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Spread the love