మట్టిలో పుట్టాడని
మట్టిలోనే తిరుగుతాడు,
పరిశుభ్రత ఎరుగని నిష్కల్మషుడు,
దుర్వాసనతో జీవించే
ఏ స్వార్థం ఎరుగని
మల్లెలాంటి మనసున్నవాడు,
మర్యాద ఎరుగకున్నా
కుతంత్రాలు తెలియని వాడు,
ముఖంలో నవ్వు తప్పా
విషానికి చోటు లేని వాడు,
మనిషే దేవుడనుకున్నాడేమో
కనిపిస్తే కాళ్ళు మొక్కడం తప్పా
ఏ అపకారం చెయ్యనివాడు,
రోజూ ఎక్కడబడితే అక్కడే కనిపించే
లోకం తెలియని పిచ్చివాడు,
ఎవరు ఎదురొచ్చినా
అక్కా తిన్నావా…
అన్నా తిన్నావా… అంటాడే గానీ
తన ఆకలి గురించి ఆలోచన లేనివాడు,
ఎప్పుడూ స్నానం చెయ్యడు
బట్టలు అసలే మార్చుకోడు,
ఎప్పుడూ ఏదీ ఆశించడు
ఎవరినీ ఏమాత్రం నిందించడు,
చెత్తలో ఏరుకొని తినేవాడు
పాపాలన్నీ తన మీద వేసుకున్నట్లు
చెత్తనంతా మూటగట్టుకొని మోసేవాడు,
లోకం పట్టనివాడు
ఎవరికీ అక్కరకు రానివాడు,
లోకం నాశనం అవుతున్నా
హాయిగా నవ్వుతూ చూస్తుంటాడు,
ఎన్నెన్నో రంగులున్న మనుషుల కన్నా
ఆ పిచ్చోడే స్వచ్ఛంగా కనిపిస్తాడు
ఆ పిచ్చోడు నిజంగా దేవుడే!
పుట్టి గిరిధర్, 9494962080
పిచ్చోడు కాదు…!
- Advertisement -
- Advertisement -



