సగం మార్గాల్లో నిలిచిన విమాన సర్వీసులు
న్యూఢిల్లీ : ప్రాంతీయ విమానయానాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించిన ఉడే దేశ్ కా ఆమ్ నగరిక్ (ఉడాన్) పథకం ఆశించిన ఫలితాలను పూర్తిగా ఇవ్వడం లేదు. ఇప్పటివరకు ప్రారంభించిన 669 విమాన మార్గాల్లో ప్రస్తుతం కేవలం 336 మార్గాల్లోనే వాణిజ్య విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. విమానయాన సంస్థలకు రాయితీల కోసం సుమారు రూ.4,700 కోట్లు వ్యయం చేసింది. మరోవైపు మారుమూల ప్రాంతాల్లో విమానాశ్రయాల అభివృద్ధికి మరో రూ.4,800 కోట్లు వెచ్చించినప్పటికీ చిన్న విమానయాన సంస్థలు మూతపడటం, సబ్సిడీ గడువు ముగిసిన తర్వాత అనేక మార్గాలు లాభదాయకంగా లేకపోవడంతో సర్వీసులు నిలిచిపోయాయి. మెట్రో విమానాశ్రయాలకు ప్రాంతీయ విమానయాన సంస్థలకు సులభంగా అనుసంధానం కల్పించడం చిన్న విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, విమానాల లీజింగ్‌కు సహకారం అందించడం ద్వారా ప్రాంతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఉడాన్ మార్గాల్లో సేవలు అందించిన అనేక చిన్న విమానయాన సంస్థలు తర్వాత దివాలా తీయడం లేదా కార్యకలాపాలను కుదించుకోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరికొన్ని సంస్థలు మూడేండ్ల సబ్సిడీ గడువు ముగిసిన తర్వాత ఆయా మార్గాలను నిర్వహించడం ఆర్థికంగా సాధ్యం కాకపోవడంతో సర్వీసులను నిలిపివేశాయి. కర్ణాటకలోని బీదర్, కలబురగి విమానాశ్రయాలకు స్టార్ ఎయిర్ నిర్వహించిన విమాన సర్వీసులు సైతం సబ్సిడీ ముగియడంతో నిలిచిపోయాయి. చిన్న విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య విమానాశ్రయాల మౌలిక సదుపాయాల కొరత. అనుమతులు లభించినప్పటికీ అనేక చిన్న విమానాశ్రయాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా లేకపోవడంతో సర్వీసులు ప్రారంభించలేకపోతున్నామని విమానయాన సంస్థల ప్రతినిధులు తెలిపారు. అలాగే విమానాల లీజింగ్, మెట్రో విమానాశ్రయాలకు అనుసంధానం, అధిక నిర్వహణ వ్యయాలు సైతం ప్రాంతీయ విమానయానానికి అడ్డంకులుగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ రెండో దశను ప్రారంభిస్తూ పథకానికి రూ.28,840 కోట్ల కేటాయింపును ప్రకటించింది. ఇందులో రూ.10,000 కోట్లు విమానయాన సంస్థలకు సబ్సిడీల రూపంలో ఇవ్వనుండగా, సబ్సిడీ కాలాన్ని మూడేండ్ల నుంచి ఐదేండ్లకు పెంచింది. అదనంగా, ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండే ప్రారంభ దశలో విమానాశ్రయాల నిర్వహణ కోసం రూ.2,577 కోట్లు కేటాయించింది. ఉడాన్ పథకం విజయవంతం కావాలంటే ఢిల్లీ, ముంబయి వంటి ప్రధాన విమానాశ్రయాలతో ప్రాంతీయ విమాన సర్వీసులకు మెరుగైన అనుసంధానం కల్పించాల్సిన అవసరం ఉందని విమానయాన రంగ ప్రతినిధులు సూచిస్తున్నారు. చిన్న విమానాశ్రయాల్లో నిబంధనలను సరళీకృతం చేయడం, విమానాల లీజింగ్‌కు సౌలభ్యం కల్పించడం, మౌలిక సదుపాయాలను వేగంగా పూర్తి చేయడం ద్వారా మాత్రమే ప్రాంతీయ విమానయాన లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
ఉడాన్ పథకానికి ఎదురుగాలి
- Advertisement -
- Advertisement -



