ఒత్తిడితో గుండె పోటు : డా.హిప్నో పద్మా కమలాకర్

నవతెలంగాణ-హైదరాబాద్ : ఒత్తిడి ఎక్కువైతే గుండె పోటు వచ్చే అవకాశం ఉందని డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ డైరెక్టర్ డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. సెప్టెంబర్ 29 న ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మంగళవారం డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో ” ఒత్తిడి – గుండె పోటు” అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ దురదృష్టవశాత్తు, గుండెపోటుకు కారణమయ్యే ఒత్తిడిని మాత్రం మనం తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటామన్నారు. తమపై ఒత్తిడి అధికంగా ఉందని అటు రోగులు లేదా వారి కన్సల్టింగ్‌ డాక్టర్లు గుర్తించడమూ కష్టమేనన్నారు . నిజానికి ఒత్తిడి అతి పెద్ద హంతకి అని అన్నారు. తీవ్ర స్ధాయి హార్ట్‌ ఎటాక్‌ రావడానికి ఇది ఒక్కటీ మన పై ఉంటే చాలని తెలిపారు. ఒత్తిడి గుండె ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతూ గుండెపోటు వచ్చేలా చేస్తుందన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం 2023, వరల్డ్ హార్ట్ డే థీమ్ ” హృదయాన్ని ఉపయోగించండి, హృదయాన్ని గురించి తెలుసుకోండి ” , ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిఒక్కరికీ వారి హృదయాలను జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక రిమైండర్ కాల్ ఇది అన్నారు. కార్డియోవాస్కులర్ డిసీజ్ (CVD) గురించి అవగాహన కల్పించేందుకు వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సెప్టెంబర్ 29 వతేదీన ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఒత్తిడి..పాము కాటు కంటే ప్రమాదమన్నారూ. ప్రస్తుతం సమస్త రోగాలకు ఇదే కారణమని తెలిపారు. అసలు ఒత్తిడి అనేది ఎక్కడ మొదలవు తుందంటే..? నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఒత్తిడి మనిషిని నీడలా వెంటాడుతూనే ఉంటుందన్నారు. సిగరెట్లు, ఆహారపు అలవాట్లు, తగ్గిన శారీరక శ్రమ మరియు మద్యపానం, ఒత్తిడి,అధిక వ్యాయామం ఇవన్నీ అనారోగ్యాలకు దోహదం చేస్తాయన్నారు. ప్రతి సంవత్సరం, దాదాపు 1.7 కోట్ల మంది హృదయ సంబంధ వ్యాధుల కారణంగా మరణిస్తున్నారన్నారు. శరీరాన్ని, మనసు ను రిలాక్స్‌గా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చన్నారు. ధూమపానం మానేయాలి, ఉప్పు మరియు చక్కెరను తగ్గించాలన్నారు. 6 గంటల నిద్ర, చురుకుగా ఉండటమే కాకుండా హాయిగా నవ్వాలన్నారు.  మూడేళ్ళ వయసున్న చిన్నారుల దగ్గర నుంచి నూరేళ్ళ వృద్ధుల వరకు అందరూ అన్ని వయసులవాళ్ళు ఒత్తిడి బారీన పడుతూనే ఉన్నారన్నారు. చిన్న తనం నుంచే జంక్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల యుక్తవయసులో గుండె పోటు వచ్చే అవకాశం ఉందన్నారు . కానీ, భావోద్వేగ కారణాలు, ఆర్థిక సమస్యలు, ప్రియమైన వారు మరణించడం కూడా ఒత్తిడికి కారణమవుతుందన్నారు. వీటికి తోడు రోజువారీ కార్యకలాపాలు కూడా ఒత్తిడి పెరిగేందుకు దోహదపడతాయి. పిల్లలకు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేయాలన్నారు. ఒత్తిడి వల్ల ఒళ్లు నొప్పులు, నీరసం ఆవరించడం, నిద్ర లేమి, ఆందోళన, కోపం, అసహనం, మతిమరుపు కనబడతాయన్నారు. మగవారు లైంగికంగా చురుకుగా లేకపోవడం గుండె పోటు వచ్చే లక్షణం గా గుర్తించాలన్నారు.గుండె ఆరోగ్యం కోసం కనీసం 30 నుంచి 40 నిమిషాలు వారానికి కనీసం 5 నుంచి 6 రోజులు వ్యాయామం చేయాలన్నారు. వ్యాయామం గుండె కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడీ హార్ట్ స్ట్రోక్ సంభవించకుండా చేస్తుందన్నారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, ఒత్తిడి నివారణకు టేక్నిక్ లను నేర్పించారు. ఈ కార్యక్రమంలో నవభారత లైయన్స్ క్లబ్ లయన్ పి.స్వరుపారాణి , లయన్ జి.కృష్ణ వేణి, సుజన, డా.క్యార్లిన్, లక్ష్మి, తల్లి దండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love