కేకేఆర్ యువ బౌలర్‌కు భారీ జరిమానా

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్‌ 17వ సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించడానికి కారణం యువ బౌలర్‌ హర్షిత్ రాణా. చివరి ఓవర్‌లో హైదరాబాద్‌కు 13 పరుగులు అవసరమైన క్రమంలో కేవలం 8 రన్స్‌ మాత్రమే ఇచ్చి తన జట్టును గెలిపించాడు. కీలకమైన క్లాసెన్‌తోపాటు షహబాజ్‌ వికెట్లను తీశాడు. అంతకుముందు ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్ (32)ను కూడా రాణా ఔట్ చేశాడు. అయితే, మయాంక్‌ పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో రాణా కాస్త అనుచితంగా ప్రవర్తించాడు. నేరుగా అతడికే ప్లైయింగ్‌ కిస్‌ ఇచ్చి సెండాఫ్ పలికాడు. క్లాసెన్ విషయంలోనూ ప్రవర్తనానియమావళిని ఉల్లంఘించాడు. దీంతో ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ప్రకారం అతడికి భారీ జరిమానా పడింది. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు కీలక ప్రకటన జారీ చేశారు. ‘‘కోల్‌కతా బౌలర్‌ హర్షిత్ రాణాకు 60 శాతం మ్యాచ్‌ ఫీజ్‌లో జరిమానా పడింది. ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్‌తో మ్యాచ్‌ సమయంలో రాణా ఆర్టికల్ 2.5 లెవల్‌ 1 నేరాలకు పాల్పడ్డాడు. దీంతో మ్యాచ్‌ రిఫరీ ఆదేశాల మేరకు 10 శాతం, 50 శాతం లెక్కన రెండు తప్పిదాలకు జరిమానా విధించాం. మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్’’ అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.

Spread the love