కేసీఆర్‌ అసమర్థ పాలనకు హిమాన్షు మాటలే నిదర్శనం

–  సమస్యలకు నిలయంగా ప్రభుత్వ పాఠశాలలు : ఏఐఎస్‌ఎఫ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్టంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలపై సీఎం కేసీఆర్‌కు, విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి పట్టింపు లేదని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌ విమర్శించారు. గౌలిదొడ్డిలోని కేశవ నగర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను చూస్తే కన్నీళ్లు వచ్చాయనీ, అందుకే దత్తత తీసుకుని అభివృద్ధి చేశానంటూ కేసీఆర్‌ మనువడు, కేటీఆర్‌ తనయుడు హిమాన్షు మాట్లాడిన మాటలు అసమర్థ పాలనకు నిదర్శనమని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఆ పాఠశాలలో ఉన్న సమస్యలను చూసి హిమాన్షు బాధపడ్డారనీ, కానీ సీఎం కేసీఆర్‌కు మాత్రం సోయిలేదని తెలిపారు. రాష్టంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయంగా ఉన్నాయనీ, ఒక్క పాఠశాలలలో కూడా సరైన మౌలిక వసతులు లేవనీ, సరిపడా ఉపాధ్యాయుల్లేరనీ, బోధనేతర సిబ్బంది లేరనీ, మధ్యాహ్న భోజనానికి గదుల్లేవనీ, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయని విమర్శించారు. అంతే కాకుండా ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు రాని పాఠశాలలు కూడా ఉన్నాయని తెలిపారు. కానీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఎమ్మెల్యేలు ఒక్క రోజు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్న పరిస్థితి లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ ఉంటే వెంటనే సమీక్ష చేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు.

Spread the love