పనితీరు ఆధారంగానే జేపీఎస్‌ల క్రమబద్ధీకరణ

– ‘ఉపాధి’లో 12 కోట్ల పనిదినాలు పూర్తిచేసే అవకాశం
– గ్రామీణాభివృద్ధికి మెటీరియల్‌ కంపొనెంట్‌ నిధులు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉపాధి హామీ చట్టంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 లక్షల పనిదినాలు పూర్తయ్యే అవకాశముందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈ చట్టం అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని చెప్పారు. అమెరికా నుంచి గురువారం ఉదయం హైదరాబాద్‌కు మంత్రి చేరుకున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ఉపాధి హామీ చట్టం అమలుపైనా, పంచాయతీరాజ్‌ శాఖ పనితీరుపైనా ఆయన సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ హనుమంతరావు, స్పెషల్‌ కమిషనర్లు, తదితర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 కోట్ల పనిదినాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. దీని ద్వారా అందరికీ ఉపాధి లభిస్తుందన్నారు. పనిదినాల ద్వారా వచ్చే మెటీరియల్‌ కంపోనెంట్‌తో అవసరమైన చోట నూతన గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మించడానికి నిధులు ఖర్చు చేయాలని ఉన్నతాధికారులను అదేశించారు. పీఆర్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అర్హులైన ప్రజలందరికీ పదోన్నతులు త్వరలో వస్తాయని హామీనిచ్చారు. కొత్తగా 750 పోస్టులు కూడా వస్తాయని తెలిపారు. త్వరలో వాటికి నోటిఫికేషన్‌ విడుదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పనితీరు మదింపుపై కమిటీ వేసామనీ, అది తన పనుల్ని ప్రారంభించిందని తెలిపారు. నివేదికల మేరకు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను విడుతల వారీగా పర్మినెంట్‌ చేస్తామన్నారు.

Spread the love