చదువుల తల్లికి బాసటగా మంత్రి ఎర్రబెల్లి

నీట్‌లో సత్తా చాటిన శతికి వెంటనే ఆర్థిక సాయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన శృతి నీట్‌ పరీక్షలో 454 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 9,292 ర్యాంకు తెచ్చుకుంది. ఎస్సీ కేటగిరీలో ఎంబీబీఎస్‌ సీటు గ్యారంటీ. కానీ, కనీస ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేని, పేదరికం ఆమెను వెక్కిరించింది. తండ్రి చేసే మేస్త్రి పని కూలీ సరిపోలేదు. తల్లి చేసే కూలీ, తన పైచదువుల ఫీజుకు సరిపోవడం లేదు. తెచ్చుకున్న ర్యాంకు, వచ్చిన మార్కులు, ఆ అమ్మాయిని వెక్కిరించాయి. ఇది జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన చెరిపల్లి శతి పరిస్థితి. విషయం తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెంటనే స్పందించారు. ఆ చదువుల తల్లికి బాసటగా నిలిచారు. శతిని, ఆమె తల్లదండ్రులను హైదరాబాద్‌కు పిలిపించుకుని శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు. శతిని బాగా చదివించిన ఆమె తల్లి తండ్రులను మంత్రి మెచ్చుకున్నారు. నీట్‌లో సత్తా చాటిన శతికి వెంటనే ఆర్థిక సాయం అందచేశారు. ఆమె చదువు పూర్తి అయ్యే వరకు ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. శతిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, శతికి సంబందించిన సమస్యను ఓ విలేకరి ట్వీట్‌ చేయగా, ప్రతిగా ఆ బాధ్యత తాము తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ రీ ట్వీట్‌ చేశారు. అయితే, ఆ బాధ్యతను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీసుకున్నారు. తన నియోజకవర్గానికి చెందిన శతి చూపిన గొప్ప ప్రతిభకు తాను సాయంగా, ఊతంగా నిలిచారు.

Spread the love