హిట్‌ అండ్‌ రన్‌ సెక్షన్‌ను రద్దు చేయాలి

హిట్‌ అండ్‌ రన్‌ సెక్షన్‌ను రద్దు చేయాలి– రవాణ రంగంలోని ట్రేడ్‌ యూనియన్స్‌తో చర్చలు జరపాలి
– అప్పటివరకు చట్టాన్ని అమలు చేయొద్దు
– ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌(సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు అజరుబాబు : రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కొత్తగా అమల్లోకి వచ్చిన ‘భారత న్యాయ సంహిత-2023’లోని హిట్‌ అండ్‌ రన్‌ సెక్షన్స్‌ 106(1)ని ఉపసంహరించుకోవాలని.. ట్రేడ్‌ యూనియన్స్‌తో చర్చలు జరిపిన తర్వాతే చట్టం అమలు గురించి ఆలోచించాలని ఆల్‌ ఇండియా రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌(సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.అజరుబాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బీఎన్‌ఎస్‌-2023 హిట్‌ అండ్‌ రన్‌ సెక్షన్స్‌ 106(1)అమలుకు వ్యతిరేకంగా ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ ఆల్‌ ఇండియా కమిటీ పిలుపుమేరకు సోమవారం రాష్ట్ర వ్యప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా, హైదరాబాద్‌ కంటోన్మెంట్‌లోని బాలమురారు సెంటర్‌, వీఎస్‌టీ ఆర్టీసీ కళ్యాణమండపం డీసీఎం స్టాండ్‌ సెంటర్‌ వద్ద, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ గణేష్‌ గుడి సెంటర్‌లలో ఆటో, ట్రాలీ డీసీఎం డ్రైవర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం భారత న్యాయ సంహితలోని 106 (1)(2)ను పూర్తిగా రద్దు చేసే వరకు డ్రైవర్‌ సోదరుల పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం 106(2)ను అమలు చేయబోమని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ.. భవిష్యత్‌లో అమలు చేయరనే గ్యారంటీ లేదన్నారు. భారత న్యాయ సంహితలో హిట్‌ అండ్‌ రన్‌ 106(1)(2) కేసుల ప్రకారం.. యాక్సిడెంట్‌ అయినప్పుడు డ్రైవర్‌ స్పాట్‌లో ఉండి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి బాధితునికి వైద్యం చేయించని పరిస్థితుల్లో.. 2 నుంచి 5 ఏండ్ల వరకు జైలు శిక్ష అని, స్పాట్‌లో లేకుండా తప్పించుకుంటే సదరు డ్రైవర్‌కు పదేండ్ల జైలు శిక్షతోపాటు రూ.7 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు జరిమానా విధించనున్నారని తెలిపారు. దీని వల్ల డ్రైవర్లను వాస్తవ పరిస్థితులకు భిన్నంగా యాక్సిడెంట్లకు దోషిగా చేసే పరిస్థితి వస్తుందన్నారు. ఈ చట్టం అమలైతే తమ ప్రమేయం లేకుండానే జీవితాలు జైలు పాలయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా ప్రస్తుతం యాక్సిడెంట్‌ జరిగితే తప్పులతో సంబంధం లేకుండా బాధితుల తరపువారు, ప్రజలు ఆవేశకావేశాలకు లోనై డ్రైవర్‌ని తప్పు పట్టడం.. కొట్టడం.. హింసించడం చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో ప్రాణాపాయం ఉందనుకున్న పరిస్థితుల్లోనే అక్కడినుంచి డ్రైవర్లు తప్పుకుంటారన్నారు.
వాస్తవ విషయాలు పరిగణనలోకి తీసుకోకుండా కొత్త చట్టం వల్ల తాము బలి పశువులమవుతామని డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారన్నారు. ఇతర దేశాల్లో యాక్సిడెంట్‌ జరిగితే డ్రైవరు లేదా అవతలి వ్యక్తి ఎవరు తప్పు చేశారనేది పరిశీలించాక శిక్ష వేస్తారన్నారు. ఇక్కడ అందుకు విరుద్ధంగా యాక్సిడెంట్‌లకు డ్రైవరే కారణమని ఏకపక్షంగా నిర్ణయించడం సరైనది కాదన్నారు. అనుకోకుండా జరిగేదే యాక్సిడెంట్‌ అని అన్నారు. అందుకు రోడ్ల వ్యవస్థ మెయింటెనెన్స్‌ సరిగా లేకపోవడం, ట్రాఫిక్‌ సిస్టం, సిగల్‌ వ్యవస్థ సరిగా లేకపోవడం 90శాతం కారణమన్నారు. వాటిని సరి చేయడం మానుకొని డ్రైవర్లను వేధించడం సబబు కాదన్నారు. తక్షణమే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ చట్టం కేవలం గూడ్స్‌ ట్రాన్స్‌పోర్టు, ఆటో రవాణా కార్మికులకే కాదని లైసెన్స్‌ ఉన్న ప్రతి వ్యక్తికీ వర్తిస్తుందన్నారు. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ఆటో, ట్రాలీ, డీసీఎం, క్యాబ్‌, టూరిస్ట్‌ బస్సు, తదితర అన్ని రకాల డ్రైవర్స్‌ ఐక్యంగా కొట్లాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ సహాయ కార్యదర్శి టి. మహేందర్‌, ఉపాధ్యక్షులు ఎం. సత్యనారాయణ, నగర నాయకులు కె.రమేష్‌, మల్లయ్య, అజం, అజీమ్‌, స్థానిక నాయకులు ధర్మన్న తదితరులు పాల్గొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రంగారెడ్డి జిల్లా ఆరాంఘర్‌ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి జాజాల రుద్రకుమార్‌ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రుద్రకుమార్‌ మాట్లాడుతూ.. ప్రమాదాలకు డ్రైవర్లను బాధ్యులుగా చేయొద్దని, కారణాలను పరిశీలించిన తర్వాత కేసును బుక్‌ చేయడం.. ఇరువురి తప్పిదాన్ని బట్టి కేసులు బుక్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే, కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని కమాన్‌ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Spread the love