Sunday, May 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుగాంధీలో కనిపించని హెచ్ఓడీలు

గాంధీలో కనిపించని హెచ్ఓడీలు

- Advertisement -

ఓపీకి దూరంగా సీనియర్ ప్రొఫెసర్లు..ప్రయివేటు ప్రాక్టీస్ కే అధిక ప్రాధాన్యత!
భారమంతా 
అసిస్టెంట్, పీజీల పైనే
సరైన వైద్యం అందక 
రోగుల అవస్థలు
వైద్యం వికటించి 
వైద్య విద్యార్థి మృతి
‘గాంధీ’లో గాడి తప్పుతున్న వైద్యం, వైద్యవిద్య

నవతెలంగాణ-సిటీబ్యూరో
‘గాంధీ’లో వైద్యం గాడి తప్పుతోంది. పేషెంట్ విభాగాల్లో కొందరు హెచ్ఓడీలు, ప్రొఫెసర్ స్థాయి వైద్యులు ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నారు. వారంతా ప్రయివేటు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో రోగులపై తీవ్ర ప్రభావం పడుతోంది. మేజర్ విభాగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో ఓపీ భారమంతా అసిస్టెంట్లు, పీజీలపైనే పడుతోంది. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు అరకొర వైద్యం అందుతున్నది. హెచ్‌ఓడీల పర్యవేక్ష‍ణ లేక జూడాలతో నెట్టుకొస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోగుల సహాయకులు చెబుతున్నారు. దాదాపు ఓపీ మొత్తం పీజీ వైద్య విద్యార్థులే చూడాల్సి వస్తుండటంతో సీనియర్ల పర్యవేక్ష‍ణ కొరవడి వైద్య విద్యార్థి మృతిచెందింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ఆరోపణలు వస్తున్నాయి. సికింద్రాబాద్‌ ‌గాంధీ ఆస్ప్రతిలో కొందరు హెచ్ఓడీలు, ప్రొఫెసర్ స్థాయి వైద్యులు కొందరు విభాగాలకే పరిమితమవుతుండగా.. మరికొంత మంది ప్రయివేటు ప్రాక్టీసుకు ప్రాధాన్యతనిస్తూ తీరిగ్గా మధ్యాహ్నం సమయంలో వస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇంకొందరు సొంత పనుల్లో నిమగ్నమై వారికి ఇష్టమొచ్చిన సమయంలో చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారనే ఫిర్యాదులూ అనేకం ఉన్నాయి. కొందరైతే ఓపీ విధులకు హాజరైనా.. గంట లేదా రెండు గంటలు ఉండి మ..మ.. అనిపించుకుని వెళ్తున్నారని బాహాటంగా మాట్లాడుకుంటున్నారు.

భారమంతా పీజీ విద్యార్థులపైనే..
ప్రొఫెసర్ స్థాయి వైద్యులు ఓపీలో అందుబాటులో లేకపోవడంతో వందల సంఖ్యలో వచ్చే రోగులకు పీజీ విద్యార్థులు సమాధానం చెప్పలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లోనైతే అసిస్టెంట్, అసోసియేట్ స్థాయి ప్రొఫెసర్లు కూడా ఓపీ విధుల్లో ఉండకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరికొందరు ప్రొఫెసర్లు తరగతుల పేరుతో మధ్యాహ్నం 2 గంటలకే బయటకు వెళ్లిపోతున్నట్టు
ఫిర్యాదులందినా.. చర్యలు మ్రాతం ఉండటం లేదు. ప్రొఫెసర్లు సైతం అలానే ఉండటంతో ఎవరిపైనా చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోతున్నారు. గతంలో కూడా ఇదే పరిస్థితి ఉంటే అప్పటి మంత్రి, ఉన్నతాధికారులు పలుమార్లు హెచ్‌ఓడీలు, ప్రొఫెసర్లను హెచ్చరించి, కచ్చితంగా ఓపీలో ఉండాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పదే పదే హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత సర్కార్ మారడం, ప్రస్తుత వైద్య శాఖ మంత్రి, అధికారులు పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో ‘గాంధీ’లో వైద్యంతోపాటు వైద్య విద్య కూడా గాడి తప్పే పరిస్థితులు నెలకొన్నాయి. అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ స్థాయి వైద్యులు ఓపీలో అందుబాటులో లేకపోవడంతో ఓపీ కోసం నిరీక్షించే రోగులకు వైద్య విద్యార్థులే దిక్కవుతున్నారు. స్పెషాలిటీ విభాగాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు సరైన వైద్యం అందడం లేదని రోగులు ఆవేదన చెందుతున్నారు.

వైద్యం వికటించి వైద్య విద్యార్థి మృతి​
గాంధీ ఆస్ప్రత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి వైద్య విద్యార్థిని బలయ్యారు. గాంధీ మెడికల్ కాలేజీలో బీఎస్సీ ఓటీటీ సెకండ్ ఇయర్ విద్యార్థిని పల్లవిగౌడ్(19)కు ఈ నెల 16న ఛాతికి సంబంధించిన సమస్య రావడంతో.. గాంధీ ఆస్ప్రతిలో చేరారు. వైద్యులు ఆమెకు ఈనెల 17న సర్జరీ చేసి కణితి తొలగించగా.. ఈ ఆపరేషన్ విఫలమైంది. దీంతో ఈనెల 19న రెండోసారి సర్జరీ చేయగా.. అది కూడా వికటించి శనివారం మృతిచెందింది. రెండోసారి సర్జరీ చేసినప్పటికీ పల్లవికి బ్లీడింగ్ అవుతూనే ఉందని.. ఆపరేషన్ సమయంలో డాక్టర్లు నిర్లక్ష్యం వహించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపించారు. ఈ ఘటనపై పల్లవి కుటుంబ సభ్యులు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పల్లవి మృతిపై విచారణ కమిటీ :
సూపరింటెండెంట్‌ ‌డాక్టర్‌ వాణి
బ్రెస్ట్ ఫైబ్రోఅడె నోమా సమస్యతో ఈ నెల 16న ఆస్పత్రిలో చేరిన పల్లవికి వైద్యులు 19న శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం ఆమెకు రక్తం గడ్డకట్టే సమస్యలు తలెత్తాయి. అనంతరం ఊపిరితిత్తుల సంబంధిత ఇబ్బందులు రావడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించాం. వైద్య బృందం అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఆమె ప్రాణాన్ని కాపాడలేకయాం. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -