ఆశాలకు ‘పరీక్ష’పై వెనక్కి తగ్గాలి

ఆశాలకు 'పరీక్ష'పై వెనక్కి తగ్గాలి– ఇప్పటికే ఎన్నో శిక్షణలు పొందారు
– కరోనా నియంత్రణలో వారి పాత్ర కీలకం
– మళ్లీ ఎగ్జామ్‌ అంటే అవమానించడమే.. :తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి
– హైదరాబాద్‌ డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వం అప్పగించే ప్రతి పనినీ ఆశాలు చేస్తున్నారు.. వారికి ఎన్నో ఏండ్ల అనుభవం ఉంది.. అన్ని రకాలుగా ప్రజలకు సేవలు చేస్తున్న వారికి మళ్లీ ఎగ్జామ్‌ పెట్టి వారి ప్రతిభను నిరూపించు కోవాలనడం వారిని అవమానించడమేనని తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు పి.విజయలక్ష్మి అన్నారు. ఆశాలకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బుధవారం సికింద్రాబాద్‌ హరిహరకళా భవన్‌ వద్ద ఉన్న హైదరాబాద్‌ డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకట్‌కు వినతిపత్రం అందజేశారు. ఆశాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాననీ, పని ఒత్తిడి, వేధింపులను అరికట్టడానికి కృషి చేస్తానని డీఎంఅండ్‌హెచ్‌ఓ హామీనిచ్చారు. అంతకుముందు ధర్నా వద్ద పి.జయలక్ష్మి మాట్లాడుతూ.. ఆశాలకు నష్టం కలిగించే పరీక్షల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతంలో 33 ఏండ్లు, మైదాన ప్రాంతంలో 19 ఏండ్ల నుంచి ఆశాలు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రారంభం నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించిన అనేక ట్రైనింగ్‌లు పొందారని చెప్పారు. రిజిస్టర్లు రాయడం, సర్వేలు చేయడం, ఆన్‌లైన్‌ పని చేయడం, బీపీ, షుగర్‌, థైరాయిడ్‌ తదితర అన్నిరకాల జబ్బులను గుర్తిస్తున్నారని, ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందులను ప్రజలకు అందజేస్తున్నారని, తగిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడూ ప్రజలకు వివరిస్తున్నారని తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలు, ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారని చెప్పారు. కరోనా నియంత్రణలో ఆశాలు కీలకపాత్ర పోషించారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారిని ‘హెల్త్‌ గ్లోబల్‌ లీడర్స్‌’ అని అవార్డు కూడా ప్రకటించినట్టు గుర్తు చేశారు. ఇన్ని పనులు నిర్వహిస్తూ, ఇంత సీనియారిటీ ఉన్న ఆశా వర్కర్లకు మళ్లీ కొత్తగా ఎగ్జామ్స్‌ నిర్వహించి వారి శక్తిని నిరూపించుకోవాలని చెప్పడం సమంజసం కాదన్నారు.
గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్నం కూడా ఇదే నిర్ణయాన్ని ముందుకు తెచ్చి అమలు చేయాలని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేయడంతో వెనక్కి తగ్గిందని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆశాలకు మళ్ళీ కొత్త సమస్యలు తేవడం అన్యాయం అన్నారు. ఈ పరీక్ష వల్ల ఎలాంటి లాభం లేదని, ఈ పనుల పట్ల ఆశాల జ్ఞాపకశక్తిని కొత్తగా నిరూపించుకుంటే ఒక సర్టిఫికెట్‌కు రూ.5వేలు ఇస్తామని ప్రభుత్వం సర్క్యులర్‌ ఇచ్చినట్టు తెలిపారు. ఏండ్లుగా చాకిరీ చేస్తున్న ఆశాలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలనీ, పీఎఫ్‌, ఈఎస్‌ఐ తదితర సౌకర్యాలు కల్పించాలనీ కోరారు. ఈ ధర్నాలో సీఐటీయూ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్‌, సౌత్‌ సిటీ కమిటీ అధ్యక్షులు ఎం.మీనా, సీనియర్‌ నాయకులు ఆర్‌.మల్లేష్‌, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు టి.యాదమ్మ, ఎం.అనిత భాగ్యలక్ష్మి పుష్పలత, కవిత, జహీదా తదితరులు పాల్గొన్నారు.
బయోమెట్రిక్‌ రద్దు చేయాలని..
కరీంనగర్‌ జిల్లాలో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ ఫీల్డ్‌ వర్కర్‌ ఏఎన్‌ఎంలకు బయోమెట్రిక్‌ విధానం రద్దు చేయాలని తెలంగాణ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుజాతకు వినతిపత్రం అందజేశారు.

Spread the love