– తలలు పట్టుకుంటున్న ప్రపంచ దేశాలు
పారిస్ : ప్రపంచ దేశాలలో కొన్ని జంతు జాతులు సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. వీటి దాడి కారణంగా పంటలు ధ్వంసమవు తున్నాయి. అడవులు సైతం కనుమరుగవుతున్నాయి. వ్యాధులు ప్రబలుతు న్నాయి. పర్యావరణ వ్యవస్థలు దెబ్బ తింటున్నాయి. ఇలా అన్ని వైపుల నుంచి దాడులు చేస్తూ విధ్వంసం సృష్టించే జంతువులు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ మానవాళికి ముప్పు కలిగిస్తున్నాయి. వీటిని నిలువరించడంలో వైఫల్యం కారణంగా సంవత్సరానికి 400 మిలి యన్ డాలర్ల మేర నష్టం వాటిల్లుతోంది. ఇది డెన్మార్క్ లేదా థారులాండ్ జీడీపీతో సమానం. జీవ వైవిధ్యంపై అధ్యయనం కోసం ఏర్పడిన ఐక్యరాజ్యసమితి సలహా మండలి సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ వాస్తవాలను బయటపెట్టింది.
పెద్ద పెద్ద జంతువులు మొదలుకొని ఎలుకలు, గోధుమ రంగు పాముల వరకూ చేస్తున్న దాడుల కారణంగా పసిఫిక్ ప్రాంతంలో ఇప్పటికే కొన్ని పక్షి జాతులు అంతరించిపోయాయి. ఈ దాడుల కారణంగా జికా వైరస్, ఎల్లో ఫీవర్, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలుతూ మానవాళి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. ఈ జంతువుల మూలాలు ఎక్కడో ఉన్నప్పటికీ అవి వేగవంతంగా వ్యాప్తి చెందుతూ ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా 37 వేలకు పైగా జంతువులు వివిధ ప్రాంతాలలోకి చొచ్చుకొని వెళ్లి అపార నష్టం కలిగిస్తున్నాయని నివేదిక తెలిపింది. జనాభా పెరుగుదల, వాతావరణ మార్పుల కారణంగా జంతువు ల వ్యాప్తి యధేచ్ఛగా సాగుతోంది. జంతువుల దాడిని ఎదుర్కొనేందుకు 17% దేశాలలో చట్టాలు కూడా అమలులో ఉన్నాయి. అయితే జంతువుల దాడికి మానవ తప్పిదాలే కారణమని నివేదిక తేల్చి చెప్పింది. ఒకవైపు మానవ కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తుంటే మరోవైపు జంతువుల దాడి కూడా అంతే వేగంగా పెరుగుతోంది.
ఉదాహరణకు 19వ శతాబ్దిలో ఇంగ్లీ షు వలసవాదులు వేట కోసం, ఆహారం కోసం న్యూజిలాండ్‌కు ఎలుకలను తీసుకొచ్చారు. వీటి ఆగడాలను అడ్డుకునేందుకు అధికారులు మాంసాహార జంతువులను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఈ జంతువులు పక్షి జాతు లపై దాడి చేసి తినడం ప్రారంభించాయి. ఏదేమైనా జంతువుల దాడిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రపంచ దేశాలు తలలు పట్టుకుంటున్నాయి.