– 8 దశల విక్రయాల్లో వాటిదే హవా
– టాప్‌లో తృణమూల్, బీఆర్‌ఎస్
పందేలు కాసే వారి దృష్టి ఎప్పుడూ గెలుపు గుర్రాల పైనే ఉంటుంది. ఎన్నికల బాండ్ల కొనుగోలు ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు అందించే వ్యక్తులు, సంస్థలు కూడా ఇదే సూత్రాన్ని పాటించడం సహజం. కానీ ఈ కొనుగోళ్ల వ్యవహారంలో ఇందుకు భిన్నంగా కొన్ని ఆశ్చర్యపరిచే ఉదంతాలు చోటుచేసుకున్నాయి. మొత్తంమీద రాజకీయ పార్టీలు రూ.12,769 కోట్ల విలువ కలిగిన బాండ్లను నగదుగా మార్చుకున్నాయి. వీటిలో దాదాపు సగం అంటే రూ.6,060 కోట్లు బీజేపీ జేబులోకే వెళ్లాయి. తృణమూల్ కాంగ్రెస్ రూ.1,609 కోట్లు, కాంగ్రెస్ రూ.1,421 కోట్లు, బీఆర్‌ఎస్ రూ.1,214 కోట్లు విరాళాలుగా అందుకున్నాయి. ఇవేవీ ఆశ్చర్యపరిచే విషయాలు కావు.
న్యూఢిల్లీ : 2018 నుండి 30 దశలుగా ఎన్నికల బాండ్ల విక్రయాలు జరిగాయి. 2018 మార్చి 1 నుండి 10వ తేదీ వరకూ తొలి దశలో బాండ్లను అమ్మారు. సంవత్సరానికి నాలుగు సార్ల చొప్పున పదేసి రోజుల పాటు బాండ్లను ఎస్‌బీఐ విక్రయించింది. ఎన్నికల సంవత్సరాల్లో మరిన్ని దశల్లో బాండ్లను అమ్మింది. బాండ్లను జారీ చేసిన తేదీ నుండి 15 రోజుల్లోగా వాటిని పార్టీలు నగదుగా మార్చుకోవాల్సి ఉంటుంది. కాగా ఎన్నికల కమిషన్ తొలుత 22 దశలకు సంబంధించిన ఎన్నికల బాండ్ల సమాచారాన్నే విడుదల చేసింది. ఈ బాండ్లు 2019 ఏప్రిల్ (తొమ్మిదవ దశ) నుండి ఈ సంవత్సరం జనవరి (30వ దశ) వరకూ విక్రయించినవి. ఈ 22 దశల్లో అమ్మిన బాండ్ల సమాచారాన్ని విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి.13 దశల్లో అమ్మిన బాండ్లలో అధిక భాగం బీజేపీ ఖాతాకే చేరాయి. వీటిలో నాలుగు దశల్లో బీజేపీకి రూ.3,012 కోట్లు వచ్చాయి. గత సంవత్సరం అక్టోబరులో అమ్మిన బాండ్లలో మాత్రం కాంగ్రెస్‌కు ఎక్కువ మొత్తం లభించింది. 2019, 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు విక్రయించిన బాండ్లను సొమ్ము చేసుకోవడంలో సైతం బీజేపీయే ప్రత్యర్థి పార్టీల కంటే బాగా ముందంజలో ఉంది.
తృణమూల్, బీఆర్‌ఎస్‌కే ఎక్కువ లబ్ది
మొత్తంమీద 22 దశల్లో జరిగిన బాండ్ల విక్రయాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కోటి మూడు దశల్లో అత్యధికంగా విరాళాలు పొందాయి. 2020 జూలైలో రూ.45.38 కోట్ల విలువ కలిగిన బాండ్లు విక్రయించగా తృణమూల్‌కు అత్యధికంగా రూ.15.38 కోట్లు అందాయి. అలాగే 2021 జనవరిలో రూ.42.07 కోట్ల విలువైన బాండ్లు అమ్మగా ఆ పార్టీకి రూ.26 కోట్లు వచ్చాయి. అదే సంవత్సరం జూలైలో రూ.150.51 కోట్ల బాండ్లు విక్రయిస్తే తృణమూల్ ఖాతాలో రూ.107 కోట్లు చేరాయి.
బీఆర్‌ఎస్ విషయానికి వస్తే 2021 అక్టోబరులో రూ.614.33 కోట్ల విలువైన బాండ్లను అమ్మితే ఆ పార్టీకి రూ.153 కోట్ల విరాళాలు అందాయి. 2022 ఏప్రిల్‌లో రూ.648.48 కోట్ల బాండ్లు అమ్మగా బీఆర్‌ఎస్ ఖాతాలో రూ.410 కోట్లు పడ్డాయి. 2023 జూలైలో రూ.812.75 కోట్ల విలువ కలిగిన బాండ్లను విక్రయించగా ఆ పార్టీకి రూ.318 కోట్లు వచ్చాయి.
2022 ఏప్రిల్‌లో 20వ దశ అమ్మకాలు జరిపారు. ఈ దశలో కూడా బీఆర్‌ఎస్ పార్టీకే ఎక్కువ విరాళాలు వచ్చాయి. ఈ దశలో వివిధ పార్టీలకు రూ.648 కోట్ల విరాళాలు అందితే ఒక్క బీఆర్‌ఎస్‌కే రూ.410 కోట్లు వచ్చాయి. డీఎంకేకు రూ.100 కోట్లు, బీజేపీకి రూ.98.5 కోట్లు అందాయి. ఈ దశలో ఫ్యూచర్ గేమింగ్ (రూ.100 కోట్లు), యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (రూ.80 కోట్లు), చెన్నరు గ్రీన్ ఉడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (రూ.50 కోట్లు), డీఎల్‌ఎఫ్ కమర్షియల్ డెవలపర్స్ లిమిటెడ్ (రూ.40 కోట్లు), హల్దియా ఎనర్జీ (రూ.25 కోట్లు), మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (రూ.25 కోట్లు) ఎక్కువ విరాళాలు ఇచ్చాయి. 2020 అక్టోబరులో జరిగిన 14వ దశ విక్రయాల్లో వైసీపీకి అత్యధిక విరాళాలు వచ్చాయి. వివిధ పార్టీలకు రూ.282.29 కోట్ల విరాళాలు అందితే అందులో వైసీపీకి రూ.89 కోట్లు వచ్చాయి. 2021 జూలైలో జరిగిన 21వ దశ విక్రయాల్లో బీజేడీ అత్యధికంగా రూ.107 కోట్లు (మొత్తం రూ.389.5 కోట్లు) పొందింది.
ఎన్నికలకు ముందే జోరు
అసలు ఎన్నికలే జరగని సమయంలో లేదా అక్కడక్కడా ఎన్నికలు జరిగినప్పుడు బాండ్ల విక్రయం చాలా తక్కువగానే ఉంది. కానీ ఎన్నికలు జరగడానికి ముందు మాత్రం అమ్మకాలు ఊపందుకున్నాయి. ఉదాహరణకు 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు రూ.2,107 కోట్ల విలువైన బాండ్లను నగదుగా మార్చుకున్నాయి. వీటిలో బీజేపీ వాటా ఏకంగా 84% (రూ.1,770 కోట్లు). ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో పలు కంపెనీలు ఆ పార్టీకి విరాళాలు ముట్టజెప్పాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత జూలైలో లావాదేవీలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆ నెలలో దాతలు కొనుగోలు చేసిన బాండ్ల విలువ కేవలం రూ.45.38 కోట్లే. హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరగడానికి అప్పటికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది.
గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఎన్నికల బాండ్ల విక్రయం జోరుగా సాగింది. 2023 అక్టోబర్, నవంబర్ నెలల్లో 28, 29 దశల విక్రయాలు జరిగాయి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు వీటి జారీ జరిగింది. గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు 2022 జనవరిలో కూడా బాండ్ల విక్రయం ముమ్మరంగా జరిగింది. ఆ సమయంలో రూ.1,212 కోట్ల విలువైన బాండ్లు అమ్మగా వాటిలో సగం బీజేపీ ఖాతాలో చేరాయి. 2021 జనవరిలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాత మూడు నెలలకు జరిగిన 17వ దశ బాండ్ల విక్రయంలో తృణమూల్‌కు అత్యధికంగా రూ.107 కోట్లు వచ్చాయి. 2022 ఏప్రిల్‌లో జరిగిన విక్రయాల్లో బీఆర్‌ఎస్ అత్యధికంగా రూ.410 కోట్లు పొందింది. అప్పటికి తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఇంకా సంవత్సరంన్నర సమయం ఉంది.
అధిక విరాళాలు ఇచ్చింది వీరే
2021 జూలైలో జరిగిన 17వ దశ బాండ్ల విక్రయాలకు సంబంధించి రాజకీయ పార్టీలు రూ.150.51 కోట్లను నగదుగా మార్చుకున్నాయి. వీటిలో తృణమూల్ రూ.107.06 కోట్లు పొందగా బీజేపీకి వచ్చింది కేవలం రూ.18 కోట్లే. ఈ దశలో ఎక్కువగా విరాళాలు అందించిన సంస్థల్లో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ పీఆర్ (రూ.30 కోట్లు), ఎంకేజే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (రూ.22.4 కోట్లు), సంజీవ్ గోయంకా నేతృత్వంలోని హల్దియా ఎనర్జీ లిమిటెడ్ (రూ.20 కోట్లు) ఉన్నాయి. 2021 అక్టోబరులో జరిగిన 18వ దశ విక్రయాలను పరిశీలిస్తే…రాజకీయ పార్టీలకు అందిన రూ.614.33 కోట్ల విరాళాల్లో బీజేపీకి వచ్చింది కేవలం పది శాతమే. ఈ దశలో బీఆర్‌ఎస్‌కు అత్యధికంగా రూ.153 కోట్లు, తృణమూల్‌కు రూ.141.94 కోట్లు, బీజేడీకి రూ.125 కోట్లు, డీఎంకేకు రూ.99 కోట్ల విరాళాలు లభించాయి. ఈ దశలో ఫ్యూచర్ గేమింగ్ (రూ.195 కోట్లు), మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (రూ.100 కోట్లు), ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండిస్టీస్ లిమిటెడ్ (రూ.50 కోట్లు), హల్దియా ఎనర్జీ లిమిటెడ్ (రూ.30 కోట్లు) అత్యధికంగా ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశాయి.
ఓడిన పార్టీలకూ అధిక విరాళాలు
ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే ఎనిమిది దశల్లో తృణమూల్ కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేడీ, వైసీపీ పార్టీలకు ఎక్కువ విరాళాలు అందాయి. బాండ్లలో చాలా వరకూ లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు ముందు కొనుగోలు చేసినవే. అప్పటికే అధికారంలో ఉన్న పార్టీకి లేదా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న పార్టీకి ఎక్కువగా విరాళాలు అందాయి. ఇందుకు రెండు మినహాయింపులు కూడా ఉన్నాయి. గత సంవత్సరం అక్టోబరులో 28వ దశ బాండ్ల విక్రయం జరిగింది. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ముందు జరిగిన ఈ అమ్మకాల్లో కాంగ్రెస్‌కు అత్యధికంగా విరాళాలు వచ్చాయి. అయితే ఆ పార్టీ ఒక్క తెలంగాణలోనే విజయం సాధించింది. అదే విధంగా 2022 నవంబరులో హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు బీజేపీకి ఎక్కువ నిధులు వచ్చాయి. కానీ ఆ ఎన్నికల్లో కమలదళం పరాజయం పాలైంది.