వాట్సాప్‌ గ్రూపులు సిద్ధం

వాట్సాప్‌ గ్రూపులు సిద్ధం– ఇన్‌ఫ్లూయెన్సర్లకు డిమాండ్‌
–  సోషల్‌ మీడియాలో వినూత్న ప్రచారాలు
 – ఎన్నికల ప్రచారం షురూ కావటంతో రాజకీయ పార్టీల వ్యూహాలు
ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల కసరత్తుకు భారత్‌ సిద్ధమవుతున్నది. రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ ప్రచారాన్ని షురూ చేశాయి. ఈ నేపథ్యంలో వాట్సప్‌ గ్రూపులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు డిమాండ్‌ పెరుగుతున్నది. ఓటర్లను ఆకర్శించేందుకు రాజకీయ పార్టీలు వీటితో పాటు పలు వ్యూహాలను పన్నుతున్నాయి. వివిధ మార్గాల్లో ముందుకు వెళ్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు తమ విజయాలను, ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ప్రచారం చేయటానికి, ఓటర్ల నుంచి మద్దతు పొందడానికి సోషల్‌ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి.
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రతినెలా 50 కోట్లకు పైగా యాక్టివ్‌ యూజర్లను కలిగి ఉన్న వాట్సాప్‌లో.. ‘ప్రధానమంత్రి నుంచి లేఖ’ను పంపటం ద్వారా బీజేపీ ఓటర్లతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నది. ఇందులో మోడీ ప్రభుత్వ విజయాలను హైలైట్‌ చేస్తూ.. ఓటర్ల నుంచి బీజేపీ అభిప్రాయాన్ని కోరుతున్నది. పార్టీ ‘మై ఫస్ట్‌ ఓటు ఫర్‌ మోడీ’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇది యూజర్లు మోడీకి ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయటానికి, వారి ఎంపిక వెనుక ఉన్న కారణాన్ని తెలిపే వీడియోను సమర్పించటానికి అనుమతిస్తుంది. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను హైలైట్‌ చేసే అనేక చిన్న వీడియోలకు ఇది వేదికగా ఉంటుంది. మరోవైపు, కాంగ్రెస్‌ పార్టీ కూడా తన వ్యూహాలతో ముందుకెళ్తున్నది. ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ వాట్సాప్‌ గ్రూప్‌ను పార్టీ నడుపుతున్నది. దీనిలో నాయకుడు ప్రజలతో సంభాషిస్తారనీ, వారి ప్రశ్నలకు సమాధానమిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ”ఏ రాజకీయ పార్టీ తన బ్యానర్‌లో ఎక్కువ వాట్సాప్‌ గ్రూపులను కలిగి ఉంటే అది ఓటర్లతో వేగంగా, మెరుగ్గా కమ్యూనికేట్‌ చేయగలదు. ఇది వారి విజయాలను పెద్ద సంఖ్యలో వినియోగదారులతో తక్షణమే హైలైట్‌ చేయటానికి, ప్రతిపక్షంతో సమాంతరంగా ఉండటం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయటానికి వారికి సహాయపడుతుంది” అని ఎన్నికల విశ్లేషకులు అమితాబ్‌ తివారీ అన్నారు.
ఒకప్పుడు సోషల్‌ మీడియా ప్రచారానికి కీలక ప్లాట్‌ఫారమ్‌ అయిన ఫేస్‌బుక్‌.. రాజకీయ పేజీలలో ప్రకటనలపై అనేక పరిమితుల కారణంగా అది క్షీణించిందని ఆయన చెప్పారు. డేటా-సేకరణ, విజువలైజేషన్‌ ప్లాట్‌ఫారమ్‌ అయిన స్టాటిస్టికా ప్రకారం ఫేస్‌బుక్‌ 36.69 కోట్ల్ల వినియోగదారులను కలిగి ఉన్నది. ”పార్టీలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఎంచుకుంటాయి. ఇవి ఎక్కువ పరిమితులు లేకుండా తక్షణమే జనాలతో కనెక్ట్‌ అవ్వటానికి, ఎక్కువ సంఖ్యలో వినియోగదారులను కలిగి ఉండటానికి సహాయపడతాయి. ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌(ట్విట్టర్‌) వంటి అనేక ఇతర ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. ఇవి నిర్దిష్ట ప్రేక్షకులకు, విభిన్న ఫార్మాట్‌లను కలిగి ఉంటాయి” అని ఆయన చెప్పారు. ఎన్నికల కమిషన్‌ డేటా ప్రకారం.. బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో మీడియా ప్రకటనల కోసం (ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌, బల్క్‌ ఎస్‌ఎంఎస్‌, కేబుల్‌ వెబ్‌సైట్‌, టీవీ ఛానెల్‌ మొదలైనవి) మొత్తం రూ.325 కోట్లు ఖర్చు చేసింది. అయితే కాంగ్రెస్‌ ఖర్చు చేసిన ఖర్చు రూ.356 కోట్లుగా ఉన్నది.
ఇటు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు కూడా గణనీయంగా గిరాకీ పెరుగుతున్నది. వారికి సంబంధించిన ప్లాట్‌ఫారమ్‌లపై రాజకీయ నాయకులు కనిపిస్తూ ఇన్‌ఫ్లూయెన్సర్ల సబ్‌స్క్రైబర్లు, ఫాలోవర్లు, అభిమానులనే గాక ఓటర్లను ప్రభావితం చేయటానికి చెమటోడుస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ ట్రెండ్‌ అధికమైందని విశ్లేషకులు చెప్తున్నారు. కేంద్ర మంత్రులు ఎస్‌. జైశంకర్‌, స్మృతి ఇరానీ, పీయూష్‌ గోయల్‌, రాజీవ్‌ చంద్రశేఖర్‌ వంటి బీజేపీ నేతలు యూట్యూబ్‌లో 70 లక్షలకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న పోడ్‌కాస్టర్‌ రణవీర్‌ అలహబాడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ట్రావెల్‌ అండ్‌ ఫుడ్‌ వీడియో పాడ్‌కాస్ట్‌ అయిన కర్లీ టేల్స్‌ వ్యవస్థాపకుడు కమియా జానీతో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కూడా భోజనం గురించి సంభాషణ చేశారు. సోషల్‌ మీడియా వినియోగంలో బీజేపీ మిగతా పార్టీలతో పోలిస్తే ముందు వరుసలో ఉన్నదని విశ్లేషకులు తెలిపారు. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ 2015లో ‘ఎక్స్‌’ (అప్పట్లో ట్విట్టర్‌) లో చేరారు. ఇందులో 2.51 కోట్ల మంది ఫాలోవర్లను ఆయన కలిగి ఉన్నారు. 2009లో ఎక్స్‌లో చేరిన ప్రధాని మోడీని 9.63 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఇటు కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా, యూపీ సీఎం యోగి, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ లు కూడా తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో అధిక సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉన్నారని విశ్లేషకులు చెప్తున్నారు.

Spread the love