కొత్త ప్రధాని చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఇజ్రాయిల్‌పై ఆయుధనిషేధం విధించాలి
నెతన్యాహు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి : ఆండీ బర్న్‌హామ్‌కు ప్రదర్శనకారుల డిమాండ్
గాజాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న జాతి హనన యుద్ధానికి నిరసనగా బ్రిటిష్ రాజధాని లండన్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. కాబోయే యూకే ప్రధాని తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రదర్శనకారులు డిమాండ్ చేశారు. అక్టోబర్ 2023 నుంచి 73,000 మందికి పైగా పాలస్తీనియన్లను బలిగొన్న ఈ ప్రాంతంపై ముట్టడి, యుద్ధాన్ని ముగించేలా టెల్ అవీవ్‌పై ఒత్తిడి తేవాలని, ఇజ్రాయిల్‌పై ఆయుధాల నిషేధం విధించాలని కోరుతూ లండన్‌లోని ప్రదర్శనకారులు రోడ్డెక్కారు. “మూడేండ్లు గా కొనసాగుతున్న జాతిహననం, బ్రిటన్‌లో ప్రపంచవ్యాప్తంగా న్యాయం, జవాబుదారీతనం కోసం బ్రిటన్ లో జరుగుతున్న ఉద్యమం మరింత బలంగా మారుతోంది,” అని యూకేలోని పాలస్తీనా రాయబారి హుసామ్ జోమ్లోట్ ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. లండన్‌లో వేలాది మంది పాలస్తీనా కోసం నిరసన తెలుపుతున్నారని, పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ చేస్తున్న మారణహోమాన్ని అంతం చేయడానికి, ఆ దేశంపై పూర్తిస్థాయి ఆయుధ నిషేధాన్ని విధించడంతో సహా, కొత్త ప్రధాని తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రదర్శన కారులు డిమాండ్ చేస్తున్నట్టు పాలస్తీనా సాలిడారిటీ క్యాంపెయిన్ పేర్కొంది. పదవీ విరమణ చేస్తున్న ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ హయాంలో జరిగిన మారణహోమాన్ని ఎదుర్కోవడంలో బర్న్‌హామ్ లేబర్ పార్టీ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇజ్రాయిల్ యుద్ధ నేరాలకు పాల్పడిందనడానికి ఆధారాలు పెరుగుతున్నప్పటికీ, ఆయన ప్రభుత్వం ఆ దేశానికి ఆయుధాలను సరఫరా చేస్తూనే ఉంది.
అతివాద మంత్రులైన ఇటామర్ బెన్-గ్విర్, బెజాలెల్ స్మోట్రిచ్‌లపై ఆంక్షలు విధించడం వంటి నామమాత్రపు చర్యలను మాత్రమే స్టార్మర్, అతని మంత్రివర్గం ఇజ్రాయిల్‌పై తీసుకున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ప్రధాన మంత్రిగా బర్న్‌హామ్ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వాటిలో జీవన వ్యయ సంక్షోభం, విపరీతంగా పెరుగుతున్న విద్యార్థి రుణాలు, సరసమైన గృహాల కొరత, గాజా విషయంలో లేబర్ పార్టీ ఉదాసీనమైన స్పందన కారణంగా సభ్యులు పార్టీని వీడి వెళ్ళిపోవడం వంటివి ఉన్నాయి. జోమ్లాట్ నాయకత్వంలో నిరసనకారులు లండన్ గుండా కవాతు చేస్తూ, పాలస్తీనాకు మద్దతుగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. పార్టీ నుంచి స్టార్మర్ బహిష్కరించబడిన మాజీ లేబర్ నాయకుడు జెరెమీ కార్బిన్ కూడా ఈ కవాతులో పాల్గొన్నారు. జాతి నిర్మూలనలో యూకే భాగస్వామ్యాన్ని అంతం చేయాలని కార్బిన్ బర్న్‌హామ్‌ను కోరారు. లేబర్ పార్టీ నాయకుడు బర్న్‌హామ్ సోమవారం అధికారికంగా యూకే తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. “కొత్త ప్రధాన మంత్రికి ఒక సందేశాన్ని వినిపించడానికి భారీ సంఖ్యలో లండన్‌లో ఉన్నాం. మేము కనుమరుగవ్వం. ఎక్కడికీ వెళ్ళిపోం, అలాగే పాలస్తీనా విముక్తి కోసం సాగిస్తున్న పోరాటానికి అండగా ఉంటామ”ని ప్రదర్శనకారులు స్పష్టం చేశారు.



