ప్రతి ఇంట్లో నేను ఉంటా..

– చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో 7500 కోట్ల తో అభివృద్ధి,
– ఉమ్మడి జిల్లాలో 12 సీట్లు బిఆర్ఎస్కే, అసంతృప్తులను బుజ్జగిస్తూనాము,
– కాంగ్రెస్ టికెట్ల ప్రకటనతో కిష్కింద కాండ,
– గెలుపు ఓకే.. దృష్టంతా మెజార్టీ పైనే.. మంత్రి జగదీష్ రెడ్డి.
నవతెలంగాణ-సూర్యాపేట.
గత 70 సంవత్సరాల పరిపాలనలో జరగని అభివృద్ధి కేవలం 9 ఏళ్లలో చేసి చూపించాం. ఏదో ఒక సంక్షేమ పథకం రూపంలో ప్రజల ఇంట్లో తాను కనిపిస్తాను. ఎన్నికలలో తన గెలుపు ఖాయం. కానీ దృష్టంతా మెజార్టీ పైన కేంద్రీకరించడం జరిగిందని విద్యుత్తు శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి నవతెలంగాణ తో జరిపిన చిట్ చాట్ తో పేర్కొన్నారు.
ప్రశ్న :ఇప్పటికే నియోజకవర్గంలో 75 వందల కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేశారు.. గెలిస్తే ఇంకేమి చేయనున్నారు?
జవాబు: అభివృద్ధి పరంగా సూర్యాపేట ను మినీ హైదరాబాద్ గా మార్చుతాను. హైదరాబాద్ ,విజయవాడ ల మధ్య గా గేట్వే గా ఉన్న సూర్యాపేట ను ఆహ్లాదకరమైన స్పాట్ గా మార్చుతాను. ఐటి హబ్ ఏర్పాటు తో నిరుద్యోగ సమస్య ను రూపుమాపుతాను.ఇంకా మనసులో నాటుకొని ఉన్న “అభివృద్ధి విజన్” ను ప్రజల దరికి చేరుస్తాను.
ప్రశ్న: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఎదుర్కోనున్నారు?
 జవాబు :కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయం లేదు.ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు వున్నారు. జరుగనున్న ఎన్నికల్లో తిరిగి 12 స్థానాలను నిలబెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ కు “కానుక”గా ఇస్తాం.ఉమ్మడి జిల్లాలో  ప్రతిపక్షాలకు నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ల ద్వారా సమాధానం చెబుతాం.జరగబోయే సభలు ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలలో టిఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి నాందిగా నిలవనున్నాయి.
ప్రశ్న: కాంగ్రెస్ పార్టీ తో ఏ విధంగా ఉండనున్నది?
 జవాబు:టిక్కెట్ల లెక్కలు తేలక వారు అవస్థలు పడడం ఖాయం. టికెట్ల ప్రకటనతో కాంగ్రెస్ లో కిష్కింద కాండ ప్రారంభమవుతుంది. వారు  సీట్ల కీచులాటల తో ఉంటే, బిఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం వీరి కీచులాట ను ఆస్వాదిస్తూ ప్రచారంలో దూసుకుపోతారు.
ప్రశ్న :ఉమ్మడి జిల్లాలో అన్ని పార్టీలు కూడా మీ ఓటమికి టార్గెట్ చేశారు. ఎలా వాటిని ఎదుర్కొంటారు?
 జవాబు :మీరు వేసిన ప్రశ్న 100% నిజమే .నేను మామూలు వ్యక్తిని కాదు. నేను జగదీష్ రెడ్డి ని, అందరి ఎత్తుగడలను ఎలా చిత్తు చేయాలో తెలుసు. ఎంతమంది ఏకమైనా సరే విజయాన్ని అడ్డుకోలేరు. ఎందుకంటే నాకు ప్రజల అండ ఉన్నది.
ప్రశ్న :కోడు అమలుతో  అభివృద్ధి పనుల శంకుస్థాపనలు చేయలేక పోయామని బాధ ఏమైనా ఉన్నదా?
 జవాబు: కోడు వస్తదని భావించలేదు. అయినప్పటికీ గతంలోనే కొన్ని కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. టెండర్లు కూడా అయిపోయాయి.పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మిగతా పనులు ఏమైనా ఉంటే అధికారులు చూసుకుంటారు.
ప్రశ్న:ఈసారి హ్యాట్రిక్ సాధ్యమేనా..?
:జాతీయ స్థాయిలో సూర్యాపేట నియోజకవర్గo లో 7500 కోట్ల తో అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. ఇదిగాక నియోజకవర్గo లోని ప్రతి గడపకు ఎదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందజేయడం జరిగింది. ప్రజల గుండెల్లో నాతో పాటు నేను చేసిన అభివృద్ధి పదిలంగా ఉన్నది.ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ సాధించడం నల్లేరు పై నడక లాoటిది.ప్రజలే నన్ను మూడోసారి ఆశీర్వదిస్తారు.ఆ ప్రగాఢ విశ్వాసం నాకు ఉంది.
ప్రశ్న:సూర్యాపేట రూపురేఖలు మారినాయని మీరు భావిస్తున్నారా…?
:గత పాలకుల హయాంలో అభివృద్ధి అనేది నిర్లక్ష్యానికి గురైంది. పాత జాతీయ రహదారిపై ప్రయాణం నరకంగా ఉండేది.గెలుపు ఓటములను పట్టించుకోకుండా రహదారి విస్తరణ చేయడం జరిగింది. ప్రస్తుతం పట్టణానికి వన్నె తెచ్చే విధంగా రహదారి ఉన్నది.అదేవిధంగా సద్దుల చెరువు ను మినీ ట్యాoక్ బండ్ గా చేయడం జరిగింది. ఇక్కడే బోటింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పడం జరిగింది. ఇంకా మెడికల్ కళాశాల, మోడ్రన్ మార్కెట్, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు,మహా ప్రస్థానం, గురుకుల పాఠశాల, డబల్ ఇండ్ల పంపిణీ, మురుగు నీటి శుద్ధి కేంద్రం,బస్తి దవాఖానలు,ఐటీ హబ్ ఈ విధంగా ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేర్చి ప్రజల అవసరాలను తీర్చడం జరుగుతుంది.
ప్రశ్న :అసంతృప్తులను ఏ విధంగా బుజ్జగిస్తున్నారు?
జవాబు: టికెట్లు ప్రకటించిన స్థానాలలో సహజంగా టికెట్లు ఆశించిన ఆశావహుల్లో నిరాశ నెలకొంది. వారందరితో  కేసీఆర్, కేటీఆర్ తో పాటు తాను చర్చిస్తున్నాము. మాకు సమయం చాలా ఉన్నది. ఆలోపు అందర్నీ బుజ్జగించి అభ్యర్థుల గెలుపులో భాగస్వాములను చేస్తాం.
 ప్రశ్న :ఈసారి ఎన్ని సీట్లు గెలవ నున్నారు?
 జవాబు: ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి నినాదంతో 12 సీట్లు గెలుస్తాం. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి లకు ఇవే చివరి ఎన్నికలు. ఇక వారు అసెంబ్లీలో అడుగు పెట్టలేరు.
 ప్రశ్న :సూర్యాపేటలో మీ విజయం సాధ్యమేనా?
జవాబు: నా గెలుపు ఖాయమే.. కానీ మెజార్టీ పైన దృష్టి పెట్టడం జరిగింది.
ప్రశ్న :మీకు సరైన ప్రత్యర్థిగా ఎవరిని భావిస్తున్నారు?
జవాబు: నాకు గట్టి పోటీ ఇచ్చే ప్రత్యర్థి లేడని భావిస్తున్నాను. ఈ క్రమంలో టికెట్ ఎవరికి వచ్చినా సరే గెలుపు సునాయాసం.
 ప్రశ్న: గత ఎన్నికల్లో మీకు పోటీ నిచ్చిన వారి పరిస్థితి ఏంటి ?
జవాబు:కాంగ్రెస్, బీజేపీ లకు పదివేల లోపు ఓట్లు కూడా రావు.వారికి ఘోర పరాభవం తప్పదు.
ప్రశ్న :మీకు ఎంత మెజార్టీ వస్తుందని భావిస్తున్నారు?
 జవాబు: చేసిన అభివృద్ధితోపాటు పార్టీలో చేరిన వారితో కలుపుకుని తనకు పడే ఓట్లతో 50 వేలకు పైగా మెజార్టీ సాధిస్తాను. మిరాకిల్ జరిగితే లక్ష మెజార్టీ కూడా రావచ్చు.
 ప్రశ్న :మళ్లీ ఎన్నికల్లో మీరు గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశించవచ్చా?
జవాబు: దళితులకు, ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కుతాయి. కెసిఆర్ నిర్ణయమే శిరోధార్యం. రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ ని మరోమారు ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. వారి ఆశీర్వాదంతో అన్ని ప్రాంతాలలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం ఖాయం.
Spread the love