”ఐ ఆమ్‌ జాబ్‌ లెస్‌..”

– బతకడానికి ఏ కారణం లేదంటూ.. ఓ యువకుడు ఆత్మహత్య
– కంటతడి పెట్టిస్తున్న సూసైడ్‌ నోట్‌
– సిరిసిల్ల బీవై నగర్‌లో విషాదం
నవతెలంగాణ – సిరిసిల్ల
”నాకు ఉద్యోగం లేదు.. నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు.. నేను బతకడానికి కారణమే లేదంటూ.. ఉజ్వల భవిష్యత్‌ కోసం ఎన్నో కలలు కన్నా అవి కండ్ల ముందే ఆవిరి అయిపోవడంతో నిస్పృహకు లోనైన ఓ యువకుడు.. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్‌లో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం బీవై నగర్‌కు చెందిన చిటికెన నాగభూషణం-సుశీల దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్న కొడుకు నవీన్‌ కుమార్‌(30) డిగ్రీ పూర్తి చేసాడు. ఇటీవల సాఫ్ట్‌వేర్‌ వైపు వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో చదివిన చదువుకు తగిన ఉద్యోగం లేదని మనస్తాపంతో శుక్రవారం ఇంట్లో తన గదిలో ఉరివేసుకున్నట్టు తెలిపారు. నవీన్‌ కుమార్‌ రాసిన సూసైడ్‌ నోట్‌లో తాను బతకడానికి కారణాలేమి లేవంటూ, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, జాబ్‌ లేదంటూ ప్రస్తావిస్తూ.. తన జీవితాన్ని ముగిస్తున్నానంటూ లేఖలో పేర్కొన్నాడు. ఈ సూసైడ్‌ పలువురిని కంటతడి పెట్టిస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. నవీన్‌ కుమార్‌ మరణంతో బీవై నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love