– ప్రజల పక్షం పోరాడే కమ్యూనిస్టులను అసెంబ్లీకి పంపండి …. జూలకంటి విస్తృత ప్రచారం
నవతెలంగాణ-మిర్యాలగూడ : మిర్యాలగూడలో 45 సంవత్సరాలుగా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్నాను.. నేను మీ వాడిని.. నేను లోకల్.. నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించండి.. చట్టసభల్లో కమ్యూనిస్టులు ఉంటేనే ప్రజాపక్షం ఉంటుంది.. అని సీపీఐ(ఎం) అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి విస్తృత ప్రచారం చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎన్‌ఎస్పీ క్యాంపు, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో వాకర్స్‌ను, ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులను, రైతు బజార్‌లో కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువులు అమ్మే వారిని కలిసి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసం పోరాడే కమ్యూనిస్టు నాయకులు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తనను గెలిపిస్తే ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. మీ వాడిగా నన్ను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. ప్రచారంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, భవాండ్ల పాండు, రాగిరెడ్డి మంగా రెడ్డి, పరుశురాములు, వధూద్, పల్లా బిక్షం, దేవయ్య, శివ, రామారావు పాల్గొన్నారు.