దాతృత్వ అవయవాలకు గుర్తింపు సంఖ్య

Identification Number for Charitable Organs– నొట్టో కింద నమోదు తప్పనిసరి : కేంద్రం
– దాతృత్వ అవయవాలకు గుర్తింపు సంఖ్య
న్యూఢిల్లీ : అవయవ మార్పిడికి సంబంధించిన అన్ని కేసుల్లో దాత (బ్రతికి ఉన్నా, మరణించినా), గ్రహీత ఇద్దరికీ కూడా ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (నొట్టో) ద్వారా ఈ గుర్తింపు కేటాయించబడుతుంది. నొట్టో వైబ్‌సైట్‌ ద్వారా ఆస్పత్రులకు ఈ గుర్తింపు జారీ చేయబడుతుందని కేంద్రం తెలిపింది. అవయవాల అమ్మకం ముఖ్యంగా విదేశీయులకు అమ్మకాలను నిరోధించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రత్వ శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో విదేశీయులకు అవయవ దానాలు సంఖ్య పెరుగుతున్నట్లు, విదేశీయులకు అవయవదానాల్లో అక్రమాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్లు ఇటీవల నివేదికలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. విదేశీయులకు అవయవ దాన మార్పిడిలను కఠినంగా పర్యవేక్షించాలని కూడా స్థానిక అధికారులను ఈ ఉత్తర్వుల్లో కేంద్రం ఆదేశించింది. ‘మరణించిన దాత నుంచి అవయవదానాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి నొట్టో ఐడి గుర్తింపు తప్పనిసరి. జీవించి ఉన్న దాత నుంచి అవయవదానం విషయంలో అవయవ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన 48 గంటల్లోపు ఈ నొట్టో గుర్తింపు జారీ చేయాలి’ అని కేంద్రం పేర్కొంది. అవయవమార్పిడిలు చేసే ఆస్పత్రులను క్రమం తప్పకుండా తనిఖీ చేసే వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. మార్పిడి ఆపరేషన్ల నాణ్యతను, ఆపరేషన్‌ తరువాత దాత, గ్రహీతల ఆరోగ్య పరిస్థితులను విచారిస్తుండాలని తెలిపింది. నిబంధలన ఉల్లంగనలు జరిగినట్లు వెల్లడయితే ఆస్పత్రుల నమోదును రద్దు చేయడంతో తగిన చర్యలు కూడా తీసుకోవాలని పేర్కొంది. అవయవదానాలు, మార్పిడులకు సంబంధించిన పూర్తి డేటాను నొట్టోతో పంచుకోవాలని అనేక సార్లు రాష్ట్రాలను అభ్యర్థించామని, కానీ ఇంకా సమాచారం అందలేదని కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది. ఈ సమాచారం కోసం మరోసారి అభ్యర్థిస్తున్నట్లు చెప్పింది. కాగా, మానవ అవయవాలు, కణజాలాల మార్పిడి చట్టం (తోట) 1994 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న అథారిటీలు ఆయా రాష్ట్రాల్లో విదేశీయలకు జరిగిన అవయవ దానాలపై దర్యాప్తు నిర్వహించాలని ఈ నెల ప్రారంభంలోనే కేంద్ర ఫ్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చట్టంలోని నిబంధనలు ఉల్లంగించినట్లు ఫిర్యాదులు లేదా ఉల్లంఘనలు జరిగినట్టు వెలుగులోకి వచ్చినా తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.

Spread the love