అమెరికన్‌ ట్యాంకులపై రష్యన్‌ డ్రోన్ల వేట

Russian drones attack American tanks– కోటి డాలర్ల ట్యాంకులను నాశనం చేస్తున్న రష్యన్‌ వైమానిక దళం :
న్యూయార్క్‌ టైమ్స్‌
ఉక్రెయిన్‌కు సరఫరా చేసిన ఖరీదైన అమెరికన్‌ ఎమ్‌1 అబ్రమ్స్‌ ట్యాంకులు నామమాత్రపు విలువ చేసే రష్యన్‌ డ్రోన్‌ల బారిన పడుతున్నాయని, అమెరికన్‌ సైన్యానికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన చిహ్నాలలో ఒకటైన అబ్రమ్స్‌ ట్యాంకులు కూడా దాడులకు అభేద్యమైనవి కావని న్యూయార్క్‌ టైమ్స్‌ శనివారం రిపోర్ట్‌ చేసింది. అమెరికా అందించిన 31 అబ్రమ్స్‌ ట్యాంకులలో కనీసం ఐదు ట్యాంకులను ఇప్పటికే రష్యా ధ్వంసం చేసింది. మరో మూడు కొంతవరకు దెబ్బతిన్నాయి అని న్యూయార్క్‌ టైమ్స్‌ రాసింది. చాలా సందర్భాలలో, ట్యాంక్‌లు ”ఫస్ట్‌-పర్సన్‌- వ్యూ(ఎఫ్‌పీవీ) కమికేజ్‌ డ్రోన్‌ల ద్వారా ధ్వంసమ య్యాయి. వీటిని లాయిటరింగ్‌ మందుగుండు సామగ్రి అని కూడా పిలుస్తారు. ఈ డ్రోన్‌లు తమ లక్ష్యాలను ఛేదించే ముందు యుక్తిని ప్రదర్శించగలవు. కనీసం ఒక సందర్భంలో రష్యా టి-72బి3 ప్రధాన యుద్ధ ట్యాంక్‌తో జరిగిన ద్వంద్వ పోరాటంలో అబ్రమ్స్‌ ట్యాంక్‌ను ఉప సంహరించటం జరిగింది. అమెరికా సరఫరా చేసిన ఆయుధాలను నాశనం చేసినట్లు చూపే డ్రోన్ల ద్వారా తీసిన అనేక వీడియోలను రష్యన్‌ సైన్యం ప్రసారం చేసింది. ‘కొందరు అధికారులు, నిపుణులు మొదట్లో ఊహించిన దానికంటే భిన్నంగా డ్రోన్‌లను పేల్చడం ద్వారా ట్యాంకులను మరింత సులభంగా నాశనం చేయవచ్చని తేలింది’ అని న్యూయార్క్‌ టైమ్స్‌ రాసింది. ఈ పరిస్థితిని నమ్మలేనిదిగా ఆస్ట్రియన్‌ చరిత్రకారుడు, సైనిక నిపుణుడు కల్నల్‌ మార్కస్‌ రీస్నర్‌ అభివర్ణించినట్టు టైమ్స్‌ పేర్కొంది. రష్యన్‌ డ్రోన్లు ‘అత్యంత చౌకగా లభించే కచ్చితమైన ట్యాంక్‌ కిల్లర్స్‌’ అని ఆ పత్రిక రాసింది. రష్యన్‌ డ్రోన్ల కచ్చితత్వం 90 శాతం మించిపోయిందని, అవి ట్యాంకుల బలహీనమైన ప్రదేశాలను ఛేదించగలవని న్యూయార్క్‌ టైమ్స్‌ పొగిడింది.
500 డాలర్ల కంటే తక్కువ వ్యయంతో లభించే రష్యా డ్రోన్‌ కోటిడాలర్ల విలువ చేసే అబ్రమ్స్‌ ట్యాంక్‌ను ధ్వంసం చేస్తుందని, అలా జరగకుండా తప్పించుకోవటం సాధ్యపడదని కూడా టైమ్స్‌ రాసింది. డాన్‌బాస్‌ ప్రాంతంలోగల అవదీవ్కా నగరాన్ని స్వాధీనం చేసుకోవటాన్ని గానీ, రష్యా దళాల పురోగమనాన్ని గానీ ఉక్రెయిన్‌కు అమెరికా సరఫరా చేసిన 31 అబ్రమ్స్‌ ట్యాంకులు ఆపలేకపోయాయి.

Spread the love