మా సహనం నశిస్తే దుమ్ము దుమ్మే

If our patience runs out dust– ప్రజాతీర్పును ఎదుర్కోలేకే భౌతిక దాడులు
– ఆగం కాకుండా విచక్షణతో ఓటు వేయాలి
– కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలి
– మేము 24 గంటలు ఇస్తూ..మీ 5 గంటల కరెంటు చూడటానికి కర్నాటకకు రావాల్నా : సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి/జుక్కల్‌/బాన్సువాడ(నసురుల్లాబాద్‌)
ఎన్నికల్లో గెలవలేక భౌతిక దాడులకు దిగుతున్నారని, దాడులకు పాల్పడే వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజా తీర్పును ఎదుర్కోలేక భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడటం సిగ్గుచేటన్నారు. ఎన్నికల సమయంలో ఇటువంటి సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. బీఆర్‌ఎస్‌ నాయకులపై, కార్యకర్తలపై ఎవరు దాడులకు పాల్పడ్డా సహించేది లేదని హెచ్చరించారు. సోమవారం నారాయణఖేడ్‌, జుక్కల్‌, బాన్సువాడ నియోజకవర్గాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో జరిగిన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ప్రజలు ఓట్లప్పుడు ఆగమాగం కావద్దన్నారు. ఎన్నికల్లో మాయమాటలు చెప్పే కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీ లేదన్నారు. మన పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం శివకుమార్‌ తెలంగాణలో తిరుగుతూ ఆ రాష్ట్రంలో రోజుకు ఐదు గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పారన్నారు. మాకు సహనం నశిస్తే కాంగ్రెస్‌ వాళ్లు దుమ్ము దుమ్ము అవుతారని హెచ్చరించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు నారాయణఖేడ్‌ ఎట్లుండేదో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ఎట్లా ఉన్నదో ప్రజలు గమనించాలన్నారు. నారాయణఖేడ్‌ కరువుతో అల్లాడిన సమయంలో నేను మంత్రిగా ఈ ప్రాంతాన్ని పర్యటించానని, మంచినీళ్ల కోసం బిందెలతో మహిళలు కిలోమీటర్ల కొద్ది పోవాల్సిన పరిస్థితిని కళ్లారా చూసానని తెలిపారు. సింగూరు జలాలను నారాయణఖేడ్‌లోని మెట్ట ప్రాంతానికి అందించాలన్న లక్ష్యంతో బసవేశ్వర ప్రాజెక్టు చేపట్టినట్టు తెలిపారు. నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఇరిగేషన్‌ పనులు జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన రహదారులు, విద్యా సంస్థలు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నల్లవాగుపై లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం, మాసంపల్లి రోడ్డు మంజూరు, బీసీ గురుకులంతో పాటు నియోజకవర్గానికి కావాల్సిన పనులన్నీ చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్‌, జెడ్పీ చైర్మెన్‌ బిక్షపతి, ఎమ్మెల్సీ రఘుపతి రెడ్డి, మున్సిపల్‌ చైర్మెన్‌ రుబీనా నజీబ్‌, తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడ 24 గంటలు కరెంట్‌ ఇస్తుంటే.. 5 గంటలు కరెంట్‌ చూసేందుకు రావాల్నా?
”కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తెలంగాణకు వచ్చి తమ రాష్ట్రంలో 5 గంటల కరెంటు ఇస్తున్నమని గప్పాలు చెప్పిండు. కావాలంటే మీరు వచ్చి సూడుండ్రి బస్సులు పెడతం అన్నడు. మేం 24 గంటల కరెంటు ఇస్తుంటే.. మీ 5 గంటల కరెంటు సూడనీకి మేమెందుకు రావాలె” అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌, బాన్సువాడ నియోజకవర్గ కేంద్రాల్లో ఆయా అభ్యర్థులు హన్మంత్‌షిండే, పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ప్రజాఆశీర్వాద సభల్లో సీఎం ప్రసంగించారు. జుక్కల్‌ నియోజకవర్గం కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలు కలిసే చోట ఉన్నదని, కర్నాటకలో ఏం జరుగుతున్నదో, మహారాష్ట్రలో ఏం గతి ఉన్నదో మీకందరికీ తెలుసని సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర పెద్ద రాష్ట్రమైనా అక్కడ రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదన్నారు. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ ఆగ్రస్థానంలో ఉందన్నారు. కర్నాటకలో 24 గంటల కరెంటు ఇస్తమని కాంగ్రెస్‌ ఓట్లు వేయించుకొని, తీరా గెలిచాక 5 గంటలే ఇస్తున్నారని తెలిపారు. దాంతో కరెంటు లేక పంటలకు నీళ్లు చాలడం లేదని రైతులు గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు అనేక పార్టీలు వస్తాయని.. అనేక మంది నాయకులు అనేక మాటలు చెబుతారని, కాని ఆలోచించి అభివృద్ధి చేసిన వ్యక్తికి ఓటు వేయాలని సూచించారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డిని లక్ష పైచీలుకు ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Spread the love