సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె ఉధృతం

If the issues are not resolved, the strike will escalate– అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి
–  రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీల భారీ ర్యాలీలు
నవతెలంగాణ-ముషీరాబాద్‌/విలేకరులు
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మెలో భాగంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ర్యాలీలు తీశారు. వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. హైదరాబాద్‌లో సీఐటీయూ రాష్ట్ర కార్యాలయం నుంచి గోల్కొండ క్రాస్‌ రోడ్డు వరకు నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పి.జయలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ.. దేశంలో ఐసీడీఎస్‌ ప్రారం భించి 48 సంవత్సరాలు అవుతున్నా అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయకపోవడం సిగ్గు చేటన్నారు. వారి న్యాయమైన డిమాండ్ల కోసం పోరా డుతుంటే అధికారులు వేధింపులకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగా సమ్మె లోకి వెళ్లినా అధికారులు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీ ఉద్యోగులకి కనీస వేతనం రూ.26,000 ఇవ్వకపోతే కుటుంబాలు ఎలా గడుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర కార్యదర్శి ఎం.వెంకటేష్‌, అంగన్వాడీ యూనియన్‌ నగర నాయకులు టీ మహేందర్‌, నాయకులు నర్సమ్మ అనురాధ, వనిత , కుల్సుం, జానకి, రాజేశ్వరి, లలిత, విజయ, స్వప్న, శారద, దనమ్మ, సంధ్య, రాధిక, జానకి, పుష్ప, సంధ్య తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అల్వాల్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ఆఫీస్‌ వద్ద నిరసన అనంతరం అల్వాల్‌ ప్రాజెక్టు ఆఫీస్‌ నుంచి యాప్రాల్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలో హయత్‌నగర్‌ ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ సరూర్‌నగర్‌ సీడీపీఓ ఆఫీస్‌ దగ్గర బతుకమ్మ ఆడి నిరసన తెలియజేశారు. అనంతరం ర్యాలీ తీశారు.ఖమ్మం జిల్లా కేంద్రంలో అంగన్‌వాడీలు భారీ ప్రదర్శన నిర్వహించారు. జెడ్పీ సెంటర్‌ నుంచి పెవిలియన్‌ గ్రౌండ్‌ వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరంలో గ్రౌండ్‌లో జరిగిన సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర్లు మాట్లాడారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అంగన్‌వాడీల సమ్మెకు బీఎస్‌పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యర్రా కామేష్‌ సంఘీభావం తెలిపారు. భద్రాచలంలో సీఐటీయూ జిల్లా నాయకులు ఎంబి నర్సారెడ్డి మద్దతు తెలిపారు. ములకలపల్లి చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. అదేవిధంగా కొందరు చిన్నారులు కేసీఆర్‌ తాత.. మా అమ్మల బాధలు అర్థం చేసుకోండని సమ్మె శిబిరం వద్ద పలకపై రాసి పట్టుకోవడం చూపరులను కలిచివేసింది. అశ్వారావుపేటలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అంగన్‌వాడీలకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు.

Spread the love