తాగుడు మాన‌కుంటే

If you don't stop drinkingతాగుడు మనిషి జీవితాలను ఎంతగా చిన్నాభిన్నం చేస్తుందో అందరికీ తెలుసు. అయినా చాలా మంది తాగకుండా ఉండలేరు. కొంతమందైతే దానికే బానిసలుగా మారిపోతుంటారు. కొంత మంది సరదా కోసం తాగుతుంటారు. కొంత మందికైతే తాగడానికి ఏదో ఒక సాకు కావాలి. ఈ రోజు పండుగ, పుట్టిన రోజు, మనసు బాగోలేదు, చాలా సంతోషంగా ఉంది’ ఇలా తాగడానికి ఏదోక కారణం చెబుతుంటారు. మానేయమంటే ‘చాలా ప్రయత్నిస్తున్నాం, కానీ మా వల్ల కావడం లేదు’ అంటారు. ఆ తాగుడు వల్ల కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో అర్థం చేసుకోరు. అలాంటి సమస్యే ఈ వారం ఐద్వా అదాలత్‌…
రాధికకు దాదాపుగా 48 ఏండ్లు ఉంటాయి. భర్త లేడు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. అమ్మాయికి పెండ్లి అయిపోయింది. చిన్న అబ్బాయి అజయ్ బాగా తాగుతాడు. ఎవరు చెప్పినా విని పించుకోడు. అంతకు ముందు రాత్రి మాత్రమే తాగేవాడు. రానురాను పగలూ రాత్రి తేడా లేకుండా తాగడం మొదలుపెట్టాడు. చేతిలో డబ్బుంటే చాలు తాగడానికి వెళతాడు. బంధువులు, స్నేహితులు ఎంత చెప్పినా, చివరకు కొట్టినా అతనిలో ఎలాంటి మార్పూ లేదు. తాగి సైలెంట్‌గా పడుకుంటాడా అంటే అదీ లేదు. అరిచి గొడవ చేస్తాడు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ తిడుతూ గొడవలు పడుతుంటాడు.
ఫంక్షన్లకు వెళ్ళాలంటే రాధికకు చాలా ఇబ్బందిగా ఉండేది. ‘మీ అబ్బాయి ఏంటి ఇలా తాగుతున్నాడు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఎవరికీ భయపడడం లేదు. తండ్రి లేడు. ఇక ఎవరి మాట వింటాడు. నువ్వు ఉన్నప్పుడు గొడవలు చేసినా, ఎవరైనా తిట్టినా నీ ముఖం చూసి ఊరుకుంటున్నారు. రేపు నీకేమైనా అయి తే అతని పరిస్థితి ఏంటి? ఎవ్వరూ దగ్గరకు రానియ్యరు. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. మన బంధువుల్లో కాకుండా వేరే వాళ్ళతో చెప్పిస్తే ఫలితం ఉంటుందేమో చూడు’ అంటూ సలహాలిస్తుండేవారు.
అలాంటి పరిస్థితుల్లోనే ఐద్వా అదాలత్‌ గురించి తెలుసుకొని వచ్చింది. ఆమె బాధ చూసి అజరుని పిలిపించి మాట్లాడాము. అతనికి 20 ఏండ్లు ఉంటాయి. ‘ఎందుకు నువ్వు ఇలా తాగుతున్నావు. నీకేమైనా సమస్య ఉందా? ఎవరికీ చెప్పుకోలేక నీలో నువ్వే బాధపడుతున్నావా, ఇంత చిన్న వయసులో ఏంటి ఈ అలవాటు. తాగడం వల్ల నువ్వేమైనా సంతోషంగా ఉండగలుగుతు న్నావా, పగలూ రాత్రీ తేడా లేకుండా తాగు తూనే ఉన్నాం. అందరితో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. ముందు అసలు నీ సమస్య ఏంటో చెప్పు. మేమే మైనా సాయం చేయ గలిగితే చేస్తాం. నువ్వు ఇలా తాగుతుంటే మీ అమ్మ చాలా బాధపడు తుంది. నలుగురి లోకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది. ఆమెకు ఎంత కష్టం కలిగితే మా దగ్గరకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించు. ఒక పక్క మీకు తండ్రి లేడు. అయినా మీ అమ్మ మిమ్మల్ని కష్టపడి పెంచుతుంది. అలాంటి ఆమెను బాధపెట్టడం కరెక్టేనా…’ అన్నాము.
దాంతో అజయ్ ‘మా నాన్న చనిపోయినప్పటి నుండి నేను తాగడం మొదలు పెట్టాను. ఆయన హఠాత్తుగా చనిపోయారు. అప్పుడు నాకు 14 ఏండ్లు ఉంటాయి. నేను చాలా బాధపడి రోజూ ఏడుస్తుండేవాడిని. అది చూసి నా బంధువులు కొంచెం మద్యం తాగించారు. అప్పుడు అన్నీ మర్చిపోయి పడుకున్నాను. ఇలా కొన్ని రోజులు కొంచెం తాగి పడుకునేవాడిని. ఆ తర్వాత పండగలు, ఫంక్షన్‌లప్పుడు తాగడం మొదలుపెట్టాను. తర్వాత అది నాకే తెలియకుండా వ్యసనంగా మారిపోయింది. ఇప్పుడు తాగకుండా ఉండలేకపోతున్నాను. మానెయ్యడానికి ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు.
మా బంధువుల్లో ఒకామె నా గురించి మంచిగా ఆలోచించి నేను ఎలాగైనా తాగడం మానేయాలని డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్ళింది. ఆమె డబ్బుతోనే మందులు కూడా కొనిచ్చింది. వాటిని రోజూ వేసుకున్నాను. మూడు నెలల వరకు అసలు తాగలేదు. దాని వాసన వచ్చినా వాంతులు వచ్చేవి. అలాంటి సమయంలో మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది. దాంతో మళ్లీ తాగడం మొదలుపెట్టాను. నన్ను ఆస్పత్రికి తీసుకెళ్ళిన అక్క కూడా నన్ను తిట్టింది. ఇప్పుడు తను కూడా నాతో మాట్లాడడం లేదు. పైగా అసహ్యించుకుంటుంది. మా అమ్మ, అన్న, అక్క తర్వాత నేను మా బంధువుల్లో ఇష్టపడేది ఆ అక్కనే. ఇప్పుడు ఆమె కూడా నన్ను దూరం పెట్టింది. మా బంధువులందరూ నన్ను తిడుతు న్నారు. అందుకే ఇంకా ఎక్కువగా తాగుతున్నాను’ అని చెప్పాడు.
నీ కుటుంబ సభ్యులైనా, బంధువులైనా నువ్వు బాగుండాలనే కోరుకుంటున్నారు. అందుకే నిన్ను తిడుతున్నారు. అంతే తప్ప నీపై వాళ్ళకు ప్రేమ లేక కాదు. నువ్వు మారాలనే కదా నువ్వు ఇష్టపడే మీ అక్క నిన్ను ఆస్పత్రికి తీసుకెళ్ళింది. కానీ నువ్వేం చేశావు, ఇంట్లో ఏదో జరిగిందని మళ్ళీ తాగడం మొదలుపెట్టావు. దాంతో ఆమె నమ్మకాన్ని కూడా పోగొట్టుకున్నావు. మూడు నెలలు తాగడం మానేసినపుడు అందరూ నీతో ఎంత మంచిగా ఉన్నారో ఒక్క సారి గుర్తు చేసుకో. ఇంత చిన్న వయసులో అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. నువ్వు ఇలాగే ఉంటే ఎవరూ నిన్ను దగ్గరకు రానియ్యరు. అందరూ అసహ్యించుకుం టారు. నీ గురించి బంధువులకే కాదు మీ చుట్టు పక్కల అందరికీ తెలుసు. ఇలాగే వుంటే రేపు నీలాంటి వాడిని పెండ్లి చేసుకోడానికి ఏ అమ్మాయీ ముందుకు రాదు. ఇప్పటికైనా కొత్త జీవితం ప్రారంభించు. తాగడం మానుకో. నిజంగా నీకు మానెయ్యాలని ఉంటే ఇంట్లో ఏదో జరిగింది, నా మనసు బాగోలేదు అనే కారణాలతో తాగవు. ఏదైనా సమస్య వస్తే మాట్లాడుకొని పరిష్క రించుకోవాలి. అంతే కాని తాగడం సరైనది కాదు. తాగుడు మానుకొని నువ్వు మంచిగా ఉంటే రేపు నువ్వే ఎంతో మందికి ఆదర్శంగా కనిపిస్తావు. ఈ రోజు తిడుతున్న వారే రేపు నీ గురించి గొప్పగా చెప్పు కుంటారు. ఇలాగే తాగి తందనాలు ఆడితే కచ్చి తంగా అసహ్యించుకుంటారు. నీకు ఎలాంటి జీవితం కావాలో నువ్వే నిర్ణయించుకో’ అని చెప్పాము.
అతను బాగా ఆలోచించుకొని ‘మీరు చెప్పినట్టే తాగడం మానేస్తాను. అంతకు ముందు నేను వెళ్ళిన డాక్టర్‌ దగ్గరకే మళ్ళీ వెళతాను. టాబ్లెట్లు వాడతాను’ అన్నాడు. ‘కేవలం డాక్టర్‌ దగ్గరకు వెళ్ళి మందులు వాడితే సరిపోదు. కౌన్సెలింగ్‌ కూడా తీసుకోవాలి. మళ్ళీ నువ్వు దాని జోలికి వెళ్ళకూడదు’ అన్నాము. దానికి అజయ్ అంగీకరించాడు. వాళ్ళ అమ్మతో ‘అజయ్ తాగడం మానేసి మళ్ళీ మామూలు మనిషి కావడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు మీరు కాస్త ఓపిగ్గా ఉండండి. అతనికి అన్ని రకాలుగా సహకరించండి. ఏదైనా అవసరం అయితే మా దగ్గరకు తీసుకురండి’ అని చెప్పాము. అందరితో మొండిగా మాట్లాడే కొడుకు మా దగ్గరకు వచ్చి తాగడం మానేస్తాను అని చెప్పేసరికి చాలా ఆనందించింది. అవసరమైనప్పుడు వస్తానని చెప్పి కొడుకుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది.

Spread the love