ఓబీసీ మహిళలను విస్మరించడం సరికాదు

– కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లులో ఓబీసీ మహిళలను విస్మరించడం సరికాదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత విమర్శించారు. రష్యా అధికారిక వార్తా సంస్థ స్ఫూత్నిక్‌ కు కల్వకుంట్ల కవిత ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆమె బదులిస్తూ, మహిళా రిజర్వేషన్లను తక్షణమే ఎందుకు అమలు చేయడం లేదు ? అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు క్రెడిట్‌ అంతా మహిళలదేనని తెలిపారు. 75 ఏండ్లుగా ఏ రాజకీయ పార్టీ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించలేదని చెప్పారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల లోక్‌ సభలో మహిళా సభ్యుల సంఖ్య 181కి చేరుతుంది. ఇప్పుడు కేవలం 80 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం తలుచుకుంటే, రాజకీయంగా చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయవచ్చు. అందుకు 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకోవచ్చని కవిత అన్నారు.
గర్వకారణం : మేడే రాజీవ్‌ సాగర్‌
కల్వకుంట్ల కవిత ఇంటర్వ్యూ విదేశీ వార్తా సంస్థ రష్యా అధికార వార్తా సంస్థలో రావడం గర్వకారణమని తెలంగాణ ఫుడ్స్‌ చైర్మెన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌ తెలిపారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం కవిత దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేశారని గుర్తుచేశారు. గోడీ మీడియా గుర్తించకపోయినా విదేశీ మీడియా గుర్తించిందని హర్షం వ్యక్తం చేశారు.

Spread the love