Tuesday, June 30, 2026
E-PAPER
Homeజాతీయంతక్షణమే జోక్యం చేసుకోవాలి

తక్షణమే జోక్యం చేసుకోవాలి

- Advertisement -

కేంద్రమంత్రికి సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్‌ లేఖ
న్యాయం ఆధారంగా ఈసీ నిర్ణయాలు తీసుకోవాలి : ఎడిటర్స్ గిల్డ్
ఈ పరిస్థితి రేపు ఎవరికైనా ఎదురుకావచ్చు : సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్
ప్రతి ఒక్కరూ దీనిని నిరసించాలి : పిన‌ర‌యి విజ‌య‌న్
నేను చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాను: రాజగోపాల్
టెలిగ్రాఫ్ మాజీ ఎడిట‌ర్ రాజగోపాల్‌కు
ఓటు హక్కు, పాస్‌పోర్ట్ నిరాకరణపై ఆందోళ‌న వ్య‌క్తం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
టెలిగ్రాఫ్ మాజీ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ ఆర్. రాజగోపాల్‌ను ఓటర్ల జాబితా నుంచి తొలగించి, పాస్‌పోర్ట్‌ ను నిరాకరించిన ఘటన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ చర్యను రాజకీయ పార్టీలు, నాయకులు, సామాజిక కార్యకర్తలు, మీడియా సంస్థలు తీవ్రంగా విమర్శించాయి. సర్‌లో భాగంగా పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి రాజగోపాల్ పేరును తొలగించిన తర్వాత ఆయన పాస్‌పోర్ట్‌ను పునరుద్ధ రించలేదు. దీంతో ఆయన అమెరికాలో జరుగుతున్న తన కుమార్తె వివాహానికి హాజరు కాలేకపోయారు. తనకు ఎదురైన ఇబ్బందులను వివరిస్తూ రాజగోపాల్ రాసిన ఒక లేఖ సోషల్ మీడియా, ఇతర వేదికలపై వైరలైంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా క‌థ‌నాలు రాసిన‌ జర్నలిస్ట్‌పై ఇది ప్రతీకార చర్య అని కూడా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.

​ఒక ప్రముఖ దినపత్రికలో జర్నలిస్ట్‌గా, ఎడిటర్‌గా తనకే ఈ అనుభవం ఎదురైతే, మరి అణగారిన వర్గాల కష్టాలు ఏమిటని రాజగోపాల్ ప్రశ్నించారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ పాస్‌పోర్ట్ పునరుద్ధరణ దరఖాస్తును తిరస్కరిం చిన విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ సీపీఐ(ఎం) రాజ్యసభ నాయకుడు జాన్ బ్రిట్టాస్.. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కు లేఖ రాశారు. ఒక వ్యక్తిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారనే కారణంతో ఆయన పాస్‌పోర్ట్ పునరుద్ధరణ దరఖాస్తును తిరస్కరిం చడం చట్టబద్ధమేనా అని జాన్ బ్రిట్టాస్ ప్రశ్నించారు. ‘‘1967 పాస్‌పోర్ట్ చట్టం ప్రకారం, ఓటర్ల జాబితా నుంచి తొలగించడం అనేది పాస్‌పోర్ట్ పునరుద్ధ రణ దరఖాస్తును తిరస్కరించడానికి ఒక కారణంగా పరిగణించబడదు. సత్వత్ సింగ్ సాహ్నీ, మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం, చట్ట పరిధికి వెలుపల ఉన్న కారణాలతో ఎవరికీ పాస్‌పోర్ట్‌ను నిరాకరించడం గానీ, నిలిపివేయడం గానీ కుదరదు. రాజగోపాల్ పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించక పోవడమనేది ఏకపక్ష చర్య. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే పత్రాల ప్రామాణికతపైనా, వాటిని జారీ చేసే సంస్థల విశ్వస నీయతపైనా ప్రజలలో తీవ్ర సందేహాలను రేకెత్తించింది. ఈ పరిస్థితిలో, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలి’’అని జాన్ బ్రిట్టాస్ డిమాండ్ చేశారు.​ పౌర సత్వాన్ని నిర్ధారించే అన్ని ప్రక్రియల అధికారాలను బ్యూరో క్రసీకి అప్పగించి నిష్క్రియగా కూర్చోకుండా, ఎన్నికల సంఘం (ఈసీ) న్యాయం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవా లని ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది. ఈ పరిస్థితి రేపు ఎవరికైనా ఎదురుకావచ్చని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ పేర్కొన్నారు. రాజగోపాల్‌కు పాస్‌పోర్ట్ నిరాకరిం చడాన్ని సీపీఐ(ఎం), కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వంటి ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి.

​నేను చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాను: రాజగోపాల్
ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించడంతో తాను చాలా మానసిక ఒత్తిడికి గురయ్యానని రాజగోపాల్ మీడియాతో అన్నారు. ‘‘ సర్‌‌తో ఓటరు జాబితా నుంచి నా పేరును తొలగించిన తర్వాత, నేను సంబంధిత ట్రిబ్యునల్‌ లో అప్పీల్ దాఖలు చేశాను. 19 ట్రిబ్యునల్స్ ముందు 27 లక్షల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ అప్పీళ్ల పరిష్కారానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. నేను పాస్‌పోర్ట్ పునరుద్ధరణకు దరఖాస్తు చేసినప్పుడు, సర్‌‌లో నా పేరును తొలగించినందున నాకు క్లియరెన్స్ ఇవ్వలేమని పోలీసులు తెలియజేశారు. ఏ ఉత్తర్వు ఆధా రంగా ఈ చర్య తీసుకున్నారని అడిగిన ప్పుడు .. వారు సమాధానం చెప్పలేకపోయారు. సర్‌ ‌నుంచి మినహా యించబడిన వారు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకో కూడదని లేదా పాస్‌పోర్ట్ పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోకూడదని స్పష్టమైన సమాధానం లేదు. ఈ పరిస్థితి లో ప్రభుత్వం, అధికారులు, న్యాయస్థానం ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలి’’ అని రాజగోపాల్ డిమాండ్ చేశారు.

ప్రతి ఒక్కరూ దీనిని నిరసించాలి : పిన‌ర‌యి విజ‌య‌న్
పాస్‌పోర్టు నిరాక‌ర‌ణ‌ చర్యను సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. ‘‘జాతీయ దినపత్రిక ‘టెలిగ్రాఫ్’ మాజీ సంపాదకుడు, మలయాళీ అయిన ఆర్. రాజ గోపాల్ పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించడానికి అధికారులు నిరాకరించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఓటర్ల జాబితాలో ఆయన పేరు లేదనే కారణంతో పాస్‌పోర్ట్ పునరుద్ధరణ దరఖాస్తును తిరస్కరించారు. గత మార్చిలో కోల్‌‌కతాలోని బల్లిగంజ్ నియోజకవర్గంలో జరిగిన ఓటర్ల జాబితా విస్తృత సమీక్షలో రాజగోపాల్ పేరును తొలగించారు. ఫలితంగా, ఆయన పాస్‌పోర్ట్‌ను కూడా కోల్పోయారు. బెంగాల్‌కు చెందిన 27 లక్షల మంది పౌరులతో పాటు తన పేరు కూడా తొలగించబడిన రాజగోపాల్.. ట్రిబ్యునల్‌లో అప్పీల్ దాఖలు చేశారు. ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో వెంటనే హాజరు కావాలని ఆయనకు నోటీసు జారీ చేసినప్పటికీ.. జులై 17న మాత్రమే అపాయింట్‌మెంట్ లభించింది. ఈలోగా ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న తన కుమార్తె వివాహానికి హాజరు కాలేకపోయారు. ప్రపంచ ప్రఖ్యాత పత్రికా సంపాదకుడి అనుభవమే ఇలా ఉంటే, ఈ దేశంలోని సామాన్య పౌరుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. బీజేపీని తీవ్రంగా విమర్శించే వ్యక్తిగా, రాజగోపాల్ ప్రతీకార చర్యలకు గురై ఉంటారు. అయితే దీనితో పాటు, ప్రాంతీయ దృక్పథంతో, సర్‌‌తో సామాన్య పౌరులను వేటాడి, బహిష్కరిస్తున్నారు. విభజనవాద హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్లే సాధనంగా సర్‌ మారింది. ‌సర్‌ ఆధారంగా పౌరసత్వం నిర్ణయించ బడకుండా చూడటం అవసరం. పౌరుల జీవితాలు, హక్కులు కాలరాస్తున్నప్పుడు దేశాన్ని ప్రేమించేవారు మౌనంగా ఉండలేరు. ప్రజాస్వామ్యాన్ని విలువగా భావించే ప్రతి ఒక్కరూ దీనిని నిరసించాలి’’ అని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -