Tuesday, June 30, 2026
E-PAPER
Homeజాతీయంఉద్యమ కెరటం

ఉద్యమ కెరటం

- Advertisement -

​యార్లగడ్డ జోయ కన్నుమూత
నివాళులు అర్పించిన 
బీవీ రాఘవులు
నవతెలంగాణ సీజీఎం, 
ఎడిటర్‌ ‌సంతాపం
నేడు ఆమె భౌతికకాయాన్ని మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి అప్పగింత

తాడేపల్లి : ప్రజా ఉద్యమ కెరటం, ఎర్రజెండా ముద్దుబిడ్డ యార్లగడ్డ జోయ(86) గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వారి స్వగృహంలో సోమవారం కన్నుమూశారు. ఆమె నేత్రాలను విజయవాడలోని కరుణ ఐ బ్యాంకుకు కుటుంబ సభ్యులు దానం చేశారు. జోయ భర్త రామనరసింహారావు 2021లో మరణించారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు. వారిలో రెండో కుమారుడైన వై అచ్యుతరావు ప్రజాశక్తి సీజీఎమ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పెద్ద కుమారుడు ప్రసాద్‌, కుమార్తెలు బాలామణి, రమాదేవి, అమ్మాజీ.
జోయ భౌతికకాయంపై సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అరుణ పతాకాన్ని ఉంచి నివాళులర్పించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు డీ రమాదేవి, కే లోకనాథం, ప్రజాశక్తి సంపాదకులు బీ తులసీదాస్, డిప్యూటీ ఎడిటర్ వీ రాంభూపాల్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సీహెచ్ బాబూరావు, కే సుబ్బరావమ్మ, వైసీపీ ఎమ్మెల్సీ ఎం అరుణ్ కుమార్, నందిగామ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎమ్‌ జగన్ మోహన్ రావు, ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కే శ్రీదేవి, వీ సావిత్రి, ఐద్వా పూర్వ కార్యదర్శి కే స్వరూపరాణి, ఎమ్‌బి విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ, సీపీఐ(ఎం) గుంటూరు, పల్నాడు, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల కార్యదర్శులు వై నేతాజీ, విజయ్ కుమార్, వై నరసింహారావు, డీవీ కృష్ణ, ప్రజాశక్తి జనరల్ మేనేజర్లు, ఎడిటోరియల్‌ ‌బోర్డు సభ్యులు, పలువురు సీపీఎం నాయకులు, ప్రజాసంఘాల బాధ్యులు, ప్రజలు వందలాదిగా తరలివచ్చి నివాళులర్పించారు.

సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ జోహార్లు
విజయవాడలో జరుగుతున్న సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ సమావేశం… జోయ మరణవార్త తెలియగానే ఆమెకు జోహార్లర్పిస్తూ ఒక నిమిషం మౌనం పాటించింది. జోయ ఉద్యమ నేపథ్యాన్ని, తెగువను వివరిస్తూ పార్టీ ఎన్‌‌టీఆర్‌ ‌జిల్లా కార్యదర్శి డీవీ.కృష్ణ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

నేడు సంతాన సభ
జోయ సంతాప సభ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు తాడేపల్లిలోని అమరావతి ఐకాన్ (బి బ్లాక్) వద్ద నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం వైద్య పరిశోధనల నిమిత్తం ఆమె భౌతిక కాయాన్ని మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రికి అందజేస్తారు.

పలువురి సంతాపం
జోయ మృతికి సీపీఐ(ఎం) పూర్వ రాష్ట్ర కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యులు పీ మధు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీ కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి ప్రభాకరరెడ్డి, కోశాధికారి వై.కేశవరావు సంతాపం తెలిపారు.

ఉద్యమ నేపథ్యం
జోయ స్వగ్రామం ఉమ్మడి కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పమిడిముక్కల. ఆమె తల్లిదండ్రులు, పిన్నమ్మలు, పెద్దమ్మ, మేనమామలు, మేనత్తలు అందరూ స్వాతంత్ర్య పోరాటంలో, చల్లపల్లి జమిందారీ రైతాంగ పోరాటంలో నిర్బంధాలు, అరెస్టులు, జైళ్లకు వెళ్లిన వారే. తన తల్లి, పెద్దమ్మతోపాటు కాన్సన్ట్రేషన్ క్యాంపులకు జోయ వెళ్లేవారు. వారి ఇల్లే ఆఫీస్ కేంద్రంగా నడవడంతో నిత్యం జరిగే రాజకీయ సైద్ధాంతిక చర్చలు చిన్నతనంలోనే అవగాహన చేసుకునే అవకాశం జోయకు కలిగింది. ఆనాడు ఏర్పడిన కమ్యూనిస్టు భావజాలం ఆమె జీవితంలో అనేక ఒడుదుడుకులు ఎదురైనా 80వ దశకంలోనూ చెక్కుచెదరలేదు.
సీపీఐ(ఎం) నందిగామ డివిజన్ కార్యదర్శిగా (రాష్ట్రంలోనే మొట్టమొదటి డివిజన్ మహిళా కార్యదర్శి), ఉమ్మడి కృష్ణా జిల్లా కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు. ఐద్వా, రైతు సంఘాల్లోనూ పనిచేశారు. విజయ మిల్క్ డెయిరీ డైరెక్టర్ గా, చందర్లపాడు పాల కేంద్రం అధ్యక్షులుగా బహుముఖ బాధ్యతలు నిర్వహించారు. పార్టీ కార్యాలయాల నిర్మాణం, పూర్తి కాలం కార్యకర్తల బాగోగులు పట్టించుకోవడం, వర్గ దృక్పథంతో అభ్యుదయంగా జీవించడం ఆమె నుంచి అందరూ నేర్చుకోవాలని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.

నవతెలంగాణ సీజీఎం, ఎడిటర్‌ ‌సంతాపం
యార్లగడ్డ జోయ ఆకస్మిక మరణం పట్ల నవతెలంగాణ సీజీఎం పీ ప్రభాకర్‌, సంపాదకులు రాంపల్లి రమేశ్‌ ‌సంతాపం తెలిపారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. యార్లగడ్డ జోయ కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారనీ, అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారని ఆమె సేవల్ని కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -