22 వేల దొంగ ఓట్లు, 11 వేల మంది
కర్నాటక ఓటర్లు.. బోధన్ లో 7 వేల ఓట్లు తొలగిస్తే..
కొడంగల్ లో 800 ఓట్లు మాత్రమే తీసేశారు
సర్ పై ఈసీ స్పష్టతనివ్వాలి
అంతర్రాష్ట్ర డూప్లికేషన్ ఓట్లను ఏరివేసే వ్యవస్థ ఉందా?
వన్ నేషన్.. వన్ ఎలక్షన్..
వన్ ఓట్ అనే విధానం ఉండాలి : టీఆర్ ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీఎం రేవంత్ రెడ్డి.. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నకిలీ ఓట్లు, కర్నాటక ఓటర్లతో గెలిచారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. 22 వేల దొంగ ఓట్లు, 11 వేల మంది కర్నాటక ఓటర్ల సాయంతో ఆయన గట్టెక్కారని ఎద్దేవా చేశారు. ఏడాదిన్నర కాలంలో బోధన్ నియోజకవర్గంలో 7 వేల ఓట్లు తీసేస్తే.. కొడంగల్ నియోజకవర్గంలో 800 ఓట్లు మాత్రమే తీసేశారని తెలిపారు. సర్ పై అనేక అనుమానాలున్నాయనీ, వాటిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనివ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం వద్ద అంతర్రాష్ట్ర డూప్లికేషన్ ఓట్లను ఏరివేసే వ్యవస్థ ఉందా? అని ఆమె ప్రశ్నించారు. ఒక దేశం, ఒక ఎన్నిక, ఒక ఓటు అనే విధానం ఉండాలని ఆమె డిమాండ్ చేశారు.
సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. ఇతర దేశాలకు చెందిన వారు మన దేశంలో ఓటు వేయకుండా నిరోధించిన ఎన్నికల సంఘం ఇతర రాష్ట్రాల వారు కొంత మంది రెండు, మూడు రాష్ట్రాల్లో ఓటు వేసినా పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్లను నియంత్రించకపోతే సర్ తో ప్రయోజనం లేదని ఆమె తేల్చి చెప్పారు.
7 వేల మంది ఓటర్లు ఏమయ్యారు..?
బోధన్ లో 7 వేల ఓట్లను ఎందుకు తొలగించారని కవిత ప్రశ్నించారు. వారంతా అక్కడి నుంచి తరలి వెళ్లారా? లేక చనిపోయారా? ఎన్నికల సంఘం కారణం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నియోజకవర్గంలో 2 శాతానికి మించి ఓట్లు తొలగించాలంటే ఎవరివైతే ఓట్లు తొలగిస్తారో వారికి మూడు సార్లు నోటీసులు ఇవ్వాలనే నిబంధన ఈసీ రూల్స్ లోనే ఉందని గుర్తు చేశారు. 7 వేల ఓట్లు అంటే అవి ఒక అభ్యర్థి విజయాన్ని నిర్ణయించే పెద్ద మొత్తంలో ఓట్లని చెప్పారు.
కొడంగల్ లో అక్రమంగా 33 వేల ఓట్లు
అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందా? అని తెలుసుకునేందుకు కొడంగల్ నియోజకవర్గంలో జాబితాను తనిఖీ చేస్తే ఆశ్చర్యపోయే విషయాలు వెలుగు చూశాయని కవిత తెలిపారు. 2018 నుంచి 2023 నాటి ఎన్నికల వరకు కొడంగల్ లో 30 వేల కొత్త ఓట్లు వచ్చి చేరాయని చెప్పారు. అక్కడ దాదాపుగా 22 వేలకు పైగా ఓట్లు డూప్లికేట్ ఉన్నాయని తాము గుర్తించినట్టు తెలిపారు. అవి కాకుండా కర్ణాటకకు చెందిన సెడం నియోజకవర్గంలోని 11 వేల ఓట్లు కొడంగల్ నియోజకవర్గంలో రిజిస్టర్ అయి ఉన్నాయని విస్మయం వ్యక్తం చేశారు. అంటే దాదాపుగా 33 వేల ఓట్లు అక్రమంగా ఉంటే అక్కడ 800 ఓట్లు మాత్రమే తొలగించారని చెప్పారు. రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో 32 వేల ఓట్ల మెజార్టీ తో గెలిచారని కవిత గుర్తు చేశారు. అంటే డూప్లికేషన్, పక్క రాష్ట్రం ఓట్లతోనే ఆయన గెలిచినట్టు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం అనుకూలంగా వ్యవహరించిందా? అనే అనుమానాన్ని కవిత వ్యక్తం చేశారు. అదే విధంగా లక్ష ఓట్ల వరకు కొడంగల్ లో మోడిఫికేషన్ జరగటం కూడా అనుమానాలకు తావిస్తోందన్నారు. తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక నుంచి డబ్బు మాత్రమే కాకుండా ఓట్లు కూడా ట్రాన్స్ ఫర్ చేశారా? అంటూ ఆమె సందేహం వ్యక్తం చేశారు.
సర్ ప్రక్రియ వల్ల ప్రయోజనం ఉండాలంటే ప్రధానంగా ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్లను తొలగించాలని కవిత సూచించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మన దేశంలో ఇతర దేశస్తులకు ఓట్లు ఉండవద్దని చెప్పడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. కానీ ఒక వ్యక్తికి రెండూ మూడు రాష్ట్రాల్లో ఓటు ఉండొచ్చా? అని ప్రశ్నించారు. నటుడు ప్రకాశ్ రాజ్ కు రెండు, మూడు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంటే వాటిని తొలగించేందుకు ఏడేండ్లు పట్టిందని గుర్తు చేశారు. ఓటరు నమోదు ప్రక్రియ, సంబంధిత సమస్యలకు సంబంధించి సర్ అనేది శాశ్వత పరిష్కారం కావాలని కవిత అభిప్రాయపడ్డారు. సర్ కోసం సాధారణంగా ఈ ఏడాది జనవరి 1 నుంచి రిఫరెన్స్ పాయింట్ తీసుకోవాల్సి ఉండగా ఈసీ మాత్రం గతేడాది జనవరి 1 నుంచి రిఫరెన్స్ పాయింట్ తీసుకుందని తప్పుపట్టారు. ఈ ఏడాదిన్నరలో చాలా నియోజకవర్గాల్లో వేల కొద్దీ ఓట్లు తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఈసీ దృష్టి పెట్టాలని కవిత కోరారు. ఒక కుటుంబానికి చెందిన ఓట్లు ఒకే బూత్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాము లేవనెత్తిన అన్ని అనుమానాలను ఈసీ నివృత్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
కొడంగల్ లో నకిలీ ఓట్లతోనే సీఎం గెలుపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



