సివిల్స్‌లో అమ్మాయిలదే విజయం మొదటి నాలుగు ర్యాంకుల్లో వారే

– యూపీకి చెందిన ఇషితా కిశోర్‌కి మొదటి ర్యాంక్‌
– బీహార్‌కి చెందిన గరిమ లోహియాకి రెండో ర్యాంక్‌
– మూడో ర్యాంకులో తెలంగాణ అమ్మాయి ఉమా హారతి
– నాలుగో ర్యాంక్‌లో యూపీకి చెందిన స్మృతి మిశ్రా
– సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌- 2022 తుది ఫలితాల్లో అమ్మాయిలు మెరిశారు. తొలి నాలుగు ర్యాంక్‌లను అమ్మాయిలే సాధించారు. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన ఇషితా కిశోర్‌ ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకుతో అగ్రస్థానంలో నిలిచింది. గరిమ లోహియా (బీహార్‌), ఉమా హారతి నూకల( తెలంగాణ), స్మృతి మిశ్రా (యూపీ) వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులతో మెరిశారు. మంగళవారం యూపీఎస్సీ 2022 సివిల్స్‌ ఫలితాలను విడుదల చేసింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా టాప్‌ ర్యాంకర్లుగా అమ్మాయిలే సత్తా చాటారు. 2022 ఏడాదికి గాను మొత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్‌ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ నుంచి 72 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే ఐఎఎస్‌ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్‌ఎస్‌ కు 38, ఐపీఎస్‌ కు 200 మంది చొప్పున ఎంపికయ్యారు. ఇక సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ – ఎ కేటగిరీలో 473 మంది, గ్రూప్‌ బీ సర్వీసెస్‌ లో 131 మంది ఎంపికైనట్టు యూపీఎస్సీ ప్రకటించింది.
తెలుగు విద్యార్థుల సత్తా
ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణలోని నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె నూకల ఉమా హారతి మూడో ర్యాంకుతో మెరిశారు. అలాగే, తిరుపతికి చెందిన జివిఎస్‌ పవన్‌ దత్తా 22 వ ర్యాంకుతో మెరిశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన తరుణ్‌ పట్నాయక్‌ కు 33వ ర్యాంకు వచ్చింది. వరంగల్‌ కు చెందిన శాఖమూరి శ్రీసాయి అశ్రిత్‌ 40, సాయి ప్రణవ్‌ 60, ఆవుల సాయికృష్ణ 94, నిధి పారు (హైదరాబాద్‌) 110, జగిత్యాల జిల్లాకు చెందిన అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి వసంత్‌ కుమార్‌ 157, కమతం మహేశ్‌ కుమార్‌ 200, రావుల జయసింహారెడ్డి 217, విశాఖకు చెందిన సాహిత్య 243, అంకుర్‌ కుమార్‌ 257, బొల్లం ఉమామహేశ్వర్రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పాలువాయి విష్ణువర్దన్‌ రెడ్డి 292, గ్రంథె సాయికృష్ణ 293, వీరగంధం లక్ష్మి సుజిత 311, ఎన్‌. చేతనా రెడ్డి 346, శృతి యారగట్టి ఎస్‌ 362, సోనియా కటారియా 376, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ కు చెందిన ఇప్పలపల్లి సుష్మిత 384, రేవయ్య 410, సిహెచ్‌ శ్రావణ కుమార్‌ రెడ్డి 426, ప్రకాశం జిల్లాకు చెందిన బొల్లిపల్లి వినూత్న 462, రెడ్డి భార్గవ్‌ 772, నాగుల కృపాకర్‌ 866 ర్యాంకులతో సత్తా చాటారు.

సివిల్స్‌లో ఎస్పీ కుమార్తె
– ఉమా హారతికి ఆల్‌ ఇండియాలో మూడో ర్యాంకు

యూపీఎస్సీ పరీక్షలో నారాయణపేట ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు కుమార్తె నూకల ఉమా హారతి ఆల్‌ ఇండియాలో మూడో ర్యాంకు సాధించారు. ఈ క్రమంలో మంగళవారం జిల్లా కలెక్టర్‌ను ఉమా హారతి కలిశారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఉమాహారతికి పుష్పగుచ్చం అందించి అభినంద నలు తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌ను కలవగా.. శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో కష్టపడి చదివానని, తనకు తల్లిదండ్రులు ఎంతో సహకరించారని హారతి తెలిపారు.
సివిల్స్‌లో 885 ర్యాంకుతో ప్రణరుకుమార్‌
షెడ్యూల్‌ కులాల స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ అభినందన
మొట్టమొదటి సారిగా సవిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు హాజరై 885 ర్యాంకు సాధించిన కొయ్యాడ ప్రణరు కుమార్‌కు రాష్ట్ర షెడ్యూల్‌ కులాల స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ చౌడారపు శ్రీధర్‌ మంగళవారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. అత్యంత పేదరికంతో జీవిస్తున్న అతడి తల్లిదండ్రులు పట్టుదలతో తమ కొడుకును చదివించారని తెలిపారు.2021-22 సంవత్సరం నవంబర్‌లో నిర్వహించిన ఎంట్రెన్స్‌ ద్వారా ఎంపికై సీ శాట్‌కు శిక్షణ పొందారని పేర్కొన్నారు. ప్రణరు కుమార్‌ సాధించిన ర్యాంకుతో స్టడీ సర్కిల్‌కు గొప్ప కీర్తి వచ్చిందని తెలిపారు.
అక్కడ శిక్షణ పొందుతున్న అభ్యర్ధులు ప్రణరును స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.

Spread the love