– మొదటిసారి బరిలో 22 మంది అభ్యర్థులు
నవతెలంగాణ జహీరాబాద్
జహీరాబాద్ చరిత్రలో శాసనసభ ఎన్నికల్లో 22 మంది అభ్యర్థులు పోటీ చేయడం చర్చినీయాంశంగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు స్వతంత్ర అభ్యర్థులు దడ పుట్టిస్తున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు తమకు అనుకూలమైన వారిని విత్‌డ్రా చేయించేందుకు శాయ శక్తుల్లా ప్రయత్నాలు చేశారు. బుజ్జగింపుల్లో సమయం దాటి పోవడంతో ఇద్దరు అభ్యర్థులు విత్‌డ్రా కోసం వెళ్లి కూడా వెనుదిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. నామి నేషన్ల అనంతరం ప్రధాన పార్టీల నాయకులు తమను బుజ్జగిస్తారని ఆలోచించే ఎక్కువ మంది నామినేషన్లు వేసినట్టు తెలిసింది. తమ బలం ఏంటో ప్రజల మధ్య తేల్చుకుంటామని స్వతంత్ర అభ్యర్థులు చెబుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులను బుజ్జగించడానికి బదులు ప్రధాన పార్టీలు తమ మ్యానిఫెస్టోలను, పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరో ప్రయత్నంగా స్వతంత్ర అభ్యర్థుల ఓట్లను తమకు అనుకూలంగా మల్చుకునే విధంగా వ్యూహాలు పన్నుతున్నారు. ఓట్ల చీలికతో తమ ఓటు బ్యాంకును పదిలపర్చుకుంటే గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంది. ఈసారి ఎన్నికల్లో చక్కెర పరిశ్రమ, నిమ్జ్ బాధితులు ప్రధాన ఎన్నికల ఎజెండాగా మారనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. జహీరాబాద్ ఎత్తైన ప్రాంతంలో ఉండటంతో ఇక్కడ చెరకు ప్రధాన పంటగా పండిస్తారు. నియోజకవర్గంలో 5 వేల నుంచి పదివేల వరకు చిన్న,సన్నకారు చెరుకు రైతులు ఉన్నారు. చక్కెర పరిశ్రమ క్రషింగ్ ప్రారంభం అవ్వకపోతే అధికార పార్టీపై ప్రభావం పడుతుందని నాయకులు ఆలోచిస్తున్నారు. రైతులను, పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులను మచ్చిక చేసుకునేందుకు పలు దఫాలుగా పర్యటనలు, ప్రచారాలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. జహీరాబాద్ నియోజకవర్గంలో చివరివరకు ఎంతమంది అభ్యర్థులు ప్రచారం చేస్తారో, ఎంతమంది ఎవరికి మద్దతిస్తారో, ప్రచారం నిర్వహించకుండా మిన్నకుండిపోతారో వేచి చూడాలి మరి..