– కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీకి టీఎస్‌యూఈఈయూ వినతి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కాంగ్రెస్‌పార్టీ మ్యానిఫెస్టోలో కరెంటోళ్ల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌యూఈఈయూ) కోరింది. ఈ మేరకు సోమవారం యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే ఈశ్వరరావు, వీ గోవర్థన్, కంపెనీ కార్యదర్శి కే సత్యం, ప్రసాద్‌రాజు తదితరులు గాంధీభవన్‌లో కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ సభ్యులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు టీ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో దాదాపు 23వేల మంది ఆర్టిజన్లు పనిచేస్తున్నారనీ, వారందరినీ పర్మినెంట్ చేసినట్టు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించి, మోసం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేస్తామనే హామీని ఇవ్వాలని యూనియన్ ప్రతినిధులు కోరారు. అలాగే విద్యుత్ పంపిణీ సంస్థల్లో (డిస్కంలు) దాదాపు 1,600 మంది అన్‌మేన్డ్ కార్మికులు పనిచేస్తున్నారనీ, వారిని ఆర్టిజన్లుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ప్రయివేటు బిల్‌కలెక్టర్లు, మీటర్ రీడర్లుగా దాదాపు 3,500 మంది పనిచేస్తున్నారనీ, వీరికి కనీస వేతనాలు ఇప్పించాలని కోరారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలనీ, అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న సర్వీసులకు అనుగుణంగా రిక్రూట్‌మెంట్లు చేస్తామనే హామీని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చేర్చాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు మురళి, సురేష్, మల్లేష్, మోహన్, వెంకటేశ్వర్లు, మున్నాలాల్ తదితరులు పాల్గొన్నారు.