బందోబస్తు పెంచండి

బందోబస్తు పెంచండిసమస్యాత్మక ప్రాంతాలపై డీజీపీ సమీక్ష
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల పరంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ పోలీసు ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష జరిపారు. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పోలీసులు గుర్తించిన శాంతి భద్రతల పరంగా సమస్యాత్మక ప్రాంతాలు ఎన్ని? ప్రచార సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలు ఎన్ని? చివరికి పోలింగ్‌ సమయంలో చోటు చేసుకున్న ఘర్షణలు ఎన్ని? చివరికి ఫలితాలు వెల్లడించిన రోజు జరిగిన ఘర్షణలు ఎన్ని? వాటికి కారణాలు ఏమిటి? అనే కోణంలో డీజీపీ అధికారులతో ర్చించినట్టు తెలిసింది. వాటిని దృష్టిలో ఉంచుకొని తాజాగా మరో 20 శాతం అధికంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్టు తెలిసింది. ప్రధానంగా ఈ సారి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ముక్కోణపు పోరు జరుగుతున్న ప్రాంతాల్లో పోలింగ్‌ సందర్భంగా గొడవలు జరిగే అవకాశం ఉన్నదని ఇంటెలిజెన్స్‌ విభాగం అంతర్గతంగా హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని డీజీపీ యోచిస్తున్నట్టు సమాచారం. అలాగే, ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్ల నుంచి కూడా ఆయన సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా, పాత బస్తీ మొదలుకొని భువనగిరి, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌ మొదలైన ప్రాంతాల్లో మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను మరింత చురుకుగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించినట్టు తెలిసింది. అలాగే, 33 జిల్లాల్లో మొత్తం 49 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయటానికి ఎన్నికల కమిషన్‌ అనుమతినివ్వటంతో ఆ కేంద్రాల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నట్టు సమాచారం.

Spread the love