ఎన్డీఏకు ఇండియా జ్వరం..

– దేశం పేరును భారత్‌గా మార్చేయత్నం…!
– రాష్ట్రపతి ఆహ్వాన పత్రికలో మారిన పేరు
– మండిపడిన ప్రతిపక్షాలు

– కూటమి పేరు చెబితేనే భయపడుతోందని ఎద్దేవా
ఇండియా పేరు వింటేనే బీజేపీలో కలవరం మొదలవుతున్నట్టుంది…నిన్నా మొన్నటి దాకా ఇండియా కూటమి పేరుపైనే రాజకీయం చేసిన బీజేపీ ఇపుడు దేశానికి ఆ పేరునే మార్చేయజూస్తోంది. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ఓవైపు ఒకేదేశం..ఒకే ఎన్నిక అంటూ బిల్లు పెట్టే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు ఇండియా పేరునే మార్చేస్తే పోలా..అని ఆలోచిస్తోంది. ఆర్‌స్సెస్‌ కూడా దేశాన్ని భారత్‌ అనే పిలవాలని ఎప్పటినుంచో చెబుతోంది. అయినా ఇదేమీ వీరికి కొత్తకాదు. తమ రాజకీయ ప్రయోజనాలకోసం పథకాలు మొదలుకుని పట్టణాలు,నగరాల వరకూ పేర్లు మార్చేయటం తొమ్మిదేండ్లుగా వీరు చేస్తున్నదే. ఇపుడు ఏకంగా దేశం పేరునే మార్చాలనుకుంటున్నారా..?! ఇది ఇపుడు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

న్యూఢిల్లీ : మన దేశం పేరు మారబోతోందా? ఇప్పటి వరకూ ‘ఇండియా’ ‘భారత్‌’గా ఉన్న పేర్ల స్థానంలో ఇకపై భారత్‌ మాత్రమే ఉండబోతుదా..?. దేశ రాజధానిలో మంగళవారం జరిగిన నాటకీయ పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నలకు ‘అవును’ అనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. జీ-20 సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి భవన్‌ నుండి పంపిన విందు ఆహ్వానాలలో ద్రౌపది ముర్మును ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’ అనకుండా ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ అని సంభోదించారు. దీంతో దేశం పేరును మారుస్తున్నారంటూ వదంతులు వ్యాపించాయి. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టాయి.
జి-20 సమావేశాలను పురస్కరించుకొని విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి కార్యాలయం పంపిన ఆహ్వానం సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అయింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తనకు వచ్చిన ఆహ్వాన పత్రిక ఫొటోను ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. దాని కింద హిందీలో ‘జనగణమన అధినాయక జయహే భారత్‌ భాగ్య విధాత’ అని రాశారు. ‘2023 సెప్టెంబర్‌ 9వ తేదీ రాత్రి 8 గంటలకు జరిగే విందుకు ధర్మేంద్ర ప్రధాన్‌ను భారత్‌ రాష్ట్రపతి ఆహ్వానిస్తున్నారు’ అని ఆ పత్రికలో ముద్రించారు.
అయితే పేరు మార్చడంపై రాష్ట్రపతి భవన్‌ కానీ, జీ-20 సమావేశాలను సమన్వయం చేస్తున్న విదేశాంగ శాఖ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీనిపై రాష్ట్రపతి భవన్‌ వర్గాలను ఆరా తీయగా జీ-20 సమావేశాలను సమన్వయం చేస్తున్న విదేశాంగ శాఖ మాత్రమే స్పందిస్తుందని అంటూ దాటవేశారు. ఇండియాకు బదులు భారత్‌ పేరును ప్రభుత్వం ప్రస్తావించడం ఇది రెండోసారి. గత నెలలో మోడీ గ్రీస్‌లో పర్యటించినప్పుడు ప్రొటోకాల్‌ సామగ్రిపై ‘ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ భారత్‌’ అని ముద్రించారు. ఇప్పటి నుండి భారత్‌ అనే పదాన్నే ఉపయోగించాలని తమకు మౌఖికంగా ఆదేశాలు అందాయని సిబ్బంది తెలిపారు.
దేశంలోని 27 ప్రతిపక్ష పార్టీల కూటమి ఇండియా (ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయన్స్‌)గా ఏర్పడినప్పటి నుండి ఆ పేరుపై బీజేపీ రాద్ధాంతం చేస్తూనే ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఓ అడుగు ముందుకు వేసి ఇండియన్‌ ముజాహిదీన్‌, ఈస్ట్‌ ఇండియా కంపెనీ కూడా తమ పేర్లలో ఇండియాను చేర్చాయంటూ అక్కసు వెళ్లగక్కారు.
ప్రతిపక్షాల ఆగ్రహం
కాగా తనకు కూడా రాష్ట్రపతి భవన్‌ నుండి ఆహ్వానం అందిందని, అందులో ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాకు బదులు ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అని ఉన్నదని కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేష్‌ ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1ని ఆయన ప్రస్తావిస్తూ రాష్ట్రాల సమాఖ్య దాడికి గురయిందని వ్యాఖ్యానించారు. అమ్‌ఆద్మీ, కాంగ్రెస్‌, ఆర్జేడీ తదితర పార్టీలకు చెందిన ఎంపీలు బీజేపీ ప్రభుత్వంపై మండిపడుతూ ప్రతిపక్ష ఇండియా కూటమిని చూసి కేంద్రం ఆందోళన చెందుతోందని చెప్పారు. తాము ప్రతిపక్ష కూటమికి ఇండియా పేరు పెడితే ప్రభుత్వం దేశం పేరైన ఇండియానే మార్చాలని చూస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల ఐక్యతా బలాన్ని బీజేపీ గుర్తించిందని, అందుకే ఇండియా అనే పేరు వింటేనే భయపడుతోందని ఎత్తిపొడిచారు. ఎన్నికల్లో బీజేపీని ఇండియా ఇంటికి సాగనంపుతుందని చెప్పారు. ఇండియా కూటమిని చూసి కలవరపడిన బీజేపీ ఇప్పుడు దేశం పేరును మార్చేందుకు సిద్ధపడిందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. ‘రేపు మేము మా కూటమి పేరును భారత్‌గా మార్చుకుంటే భారత్‌ పేరును కూడా మారుస్తారా?’ అని ప్రశ్నించారు. ఇండియాను చూసి బీజేపీ భయపడుతోందని, ఆ పార్టీవి చిల్లర రాజకీయాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వ్యాఖ్యానించారు. ‘భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1 చెబుతోంది. ఇండియా పేరు వింటేనే బీజేపీ భయపడుతోంది. దానివి చిల్లర రాజకీయాలు. మోడీజీ…ప్రయత్నించండి. జుడేగా భారత్‌…జీతేగా ఇండియా’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ప్రతిపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టి కేవలం కొన్ని వారాలే అయిందని, అంతలోనే బీజేపీ ఆహ్వాన పత్రికల్లో ఇండియా పేరును భారత్‌గా మార్చేసిందని ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా చెప్పారు. తమ నుండి ఇండియాను కానీ, భారత్‌ను కానీ మోడీ లాగేసుకోలేరని అన్నారు.
రాజ్యాంగం ఏం చెబుతోంది..?
” ఇండియా.. అంటే భారత్‌.. రాష్ట్రాల సమాఖ్య” అని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1 చెబుతోంది. రాజ్యాంగం గుర్తించిన ‘ఇండియా’, ‘భారత్‌’ పదాలు రెండూ దేశానికి అధికారిక పేర్లేనని ఆర్టికల్‌ 1 స్పష్టం చేస్తోంది. అయితే.. ఇప్పుడు ప్రతిపక్షాలు ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడటంతో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం నుంచి ఇండియా అనే పేరుని తొలగించి కేవలం భారత్‌ అనే పేరును మాత్రమే ఉంచాలని భావిస్తోందా ..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
దేశం పేరును భారత్‌గా మార్చాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై 2016లో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఇలాంటి వాటిని విచారించబోమని స్పష్టం చేసింది. ఇండియా లేదా భారత్‌ మీరు ఈ దేశాన్ని ఎలా పిలవాలనుకుంటే అలా పిలవండి. అని స్పష్టం చేసింది. 2020లో ఇలాంటి పిటిషనే విచారణకు వచ్చినప్పుడు దానిని కూడా అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఏం చేయాలి?
దేశం పేరును మార్చాలంటే రాజ్యాంగంలోని అధికరణ 1ని సవరించాలి. ఇందుకోసం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలి. దీనిని సభ ఆమోదించాలి. ఆర్టికల్‌ 1ని ప్రత్యేకంగా సవరించాలంటే సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది అంగీకరించాల్సి ఉంటుంది.

Spread the love