డబ్ల్యూటీవో నుండి భారత్‌ బయటకు రావాలి

– ఖమ్మంలో వాహనాలతో ర్యాలీ
నవతెలంగాణ-ఖమ్మం
డబ్ల్యూటీవో (ప్రపంచ వాణిజ్య సంస్థ) నుండి భారతదేశం బయటికి రావాలని, నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల డిమాండ్స్‌ వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి వై ప్రకాష్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం, అఖిల భారత రైతుకూలీ సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలతో పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి ఇందిరా నగర్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్‌, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి వై ప్రకాష్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు కోరుకుంటున్నదని అన్నారు. డబ్ల్యూటీవో నుండి భారతదేశం బయటకు రావాలని డిమాండ్‌ చేశారు. ఫిబ్రవరి 26న అబుదాబీలో డబ్య్లూటీవో కాన్ఫరెన్స్‌ ప్రారంభం కానుందని, అదే రోజు క్విట్‌ డబ్ల్యూటీవో డేగా పాటించాలని పిలుపునిచ్చిందని, రైతులకు ఎంఎస్‌పీని మంజూరు చేయకుండా ప్రజా పంపిణీ వ్యవస్థను ఉపసంహరణ కోసం భారత ప్రభుత్వాన్ని బలవంతం చేయడంతో పాటు ప్రయోజనాన్ని నేరుగా డబ్బుగా (నగదు) బదిలీ చేయాలని, భారత దేశంపై డబ్ల్యూటీవో ఒత్తిడి చేస్తున్నదని, ఈ రెండు ప్రతిపాదనలు రైతులకు, పేద ప్రజలకు మరియు ఆహార భద్రతకు మరియు భారతదేశ సార్వభౌమత్వానికి హానికరం అని అన్నారు. క్వింట్‌ డబ్య్లూటీవో డిమాండ్‌ రైతులతో పాటు ప్రజలు బలపర్చాలి అన్నారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో రైతుల నిరసన స్థలంలో రైతుల ట్రాక్టర్లను పోలీసులు ధ్వంసం చేశారన్నారు. రైతులపై అణచివేత ప్రయోగించడం, రైతు ఉద్యమాన్ని ఏకాకిని చేసి విభజించేందుకు కుట్ర పన్నారని, ఈ విభజనతో ఎన్నికల ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అలాగే మృతుల కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, పాడైన 100 ట్రాక్టర్ల మరమ్మతు ఖర్చులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే మార్చి 14న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మేరుగు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ఎర్రా శ్రీనివాసరావు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌కె మీరా, వాసిరెడ్డి ప్రసాద్‌, చెరకు మల్లి కుటుంబరావు, కుసుపూడి మధు, సంక్రాంతి నర్సయ్య యనమద్ది రామకృష్ణ, బోడపట్ల సుదర్శన్‌, గాలి అంజయ్య, ప్రవీణ్‌, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు మందుల రాజేంద్రప్రసాద్‌, ఖాసిం తదితరులు పాల్గొన్నారు.

Spread the love